సినిమా: జన నాయకుడు
నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, నాజర్, ప్రియమణి, రేవతి తదితరులు
దర్శకత్వం: హెచ్. వినోద్
నిర్మాత: వెంకట్ కె. నారాయణ
నిర్మాణ సంస్థ: కేవీఎన్ ప్రొడక్షన్స్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: ప్రదీప్ ఇ. రాఘవ్
విజయ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూసిన ‘జన నాయగన్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదలైన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా ప్రచారం జరగడం, ‘భగవంత్ కేసరి’ కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించడం, భారీ స్టార్‌కాస్ట్ ఉండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి విజయ్ చివరి సినిమా అభిమానులకు గుర్తుండిపోయే వీడ్కోలు ఇచ్చిందా? చూద్దాం.
కథేంటంటే?
వెట్రి కొండన్ (విజయ్) మదురై సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తుంటాడు. జైలులో అతడిపై పలుమార్లు దాడులు జరిగినా ప్రాణాలతో బయటపడతాడు. కొత్తగా వచ్చిన జైలు అధికారి శ్రీకాంత్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్), వెట్రిలోని మంచితనాన్ని గుర్తిస్తాడు. అనారోగ్యంతో చివరి దశలో ఉన్న వెట్రి తల్లిని చూసేందుకు అవకాశం కల్పిస్తాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ కుమార్తె విజ్జి (మమితా బైజు)తో వెట్రికి అనుబంధం ఏర్పడుతుంది. అనుకోని ప్రమాదంలో శ్రీకాంత్ మరణించడంతో విజ్జి బాధ్యతను వెట్రి తీసుకుంటాడు.
తండ్రి ఆశయానికి అనుగుణంగా విజ్జిని ఆర్మీ ఆఫీసర్‌గా చూడాలనుకుంటాడు. కానీ భయాలతో బాధపడే విజ్జి సాధారణ జీవితాన్నే కోరుకుంటుంది. ఇలాంటి సమయంలో ఆమెను ఓ ప్రమాదకరమైన గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. దాని వెనుక అంతర్జాతీయ స్థాయిలో నేర సామ్రాజ్యాన్ని నడిపించే జాన్ హిమ్లర్ (బాబీ డియోల్) ఉన్నాడని వెట్రికి తెలుస్తుంది. హిమ్లర్‌కు విజ్జితో ఉన్న సంబంధం ఏంటి? భారత్‌లో అతడి అసలు ప్లాన్ ఏంటి? విజ్జిని వెట్రి ఎలా కాపాడాడు? జర్నలిస్ట్ కయల్ (పూజా హెగ్డే) ఈ పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించింది? అనేదే మిగతా కథ.
‘భగవంత్ కేసరి’ ఛాయలు బలంగానే..
దర్శకుడు హెచ్. వినోద్ ‘భగవంత్ కేసరి’లోని ప్రధాన కథాంశాన్ని తీసుకుని విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ మార్పులు చేశారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో మాత్రం ఒరిజినల్ సినిమా ఛాయలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వెట్రి-విజ్జి మధ్య అనుబంధం, ఆమెను ధైర్యవంతురాలిగా మార్చే ప్రయత్నం వంటి సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమైనవే. దీంతో ‘భగవంత్ కేసరి’ చూసిన వారికి ఫస్టాఫ్‌లో కొత్తదనం పెద్దగా కనిపించదు. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ బ్లాక్ సినిమాకు ఊపు తీసుకొస్తుంది.
సెకండాఫ్‌లో కథే మారిపోయింది
సెకండాఫ్‌లో దర్శకుడు ఒరిజినల్ కథ నుంచి చాలా దూరం వెళ్లిపోయాడు. అక్కడి నుంచి సినిమా పూర్తిగా విజయ్ స్టార్‌డమ్, యాక్షన్, పొలిటికల్ ఇమేజ్ చుట్టూ తిరుగుతుంది. బాబీ డియోల్ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్ది, వెట్రి-హిమ్లర్ మధ్య పోరాటాన్ని భారీ స్థాయికి తీసుకెళ్లారు. అవినీతి, అన్యాయం, ప్రజల కోసం నిలబడే నాయకత్వం వంటి అంశాలతో విజయ్ పాత్రకు రాజకీయ కోణాన్ని జోడించారు. ఎంజీఆర్ ప్రస్తావనలు, విజయ్ రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసే డైలాగులు, అభిమానులను ఉద్దేశించినట్లుగా అనిపించే సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. విజయ్ ఫ్యాన్స్‌కు ఇవి మంచి కిక్ ఇస్తాయి. కానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఇదే అంశం కొన్నిచోట్ల భారంగా అనిపించవచ్చు.
ఎలివేషన్స్ ఓకే..
‘జన నాయకుడు’ను ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా కాకుండా విజయ్‌కు భారీ ఫేర్‌వెల్ మూవీగా చూస్తే చాలా సన్నివేశాలు ఎంజాయ్ చేయొచ్చు. హీరో ఎలివేషన్స్, భారీ ఫైట్లు, పంచ్ డైలాగులు, డ్యాన్స్‌లు.. అభిమానులకు కావాల్సిన అంశాలను దర్శకుడు పుష్కలంగా అందించాడు. విజయ్ పాత సినిమాలను గుర్తుచేసే కొన్ని మూమెంట్స్ కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి. కానీ కథలో లాజిక్ వెతికితే మాత్రం నిరాశ తప్పదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో యాక్షన్ డోస్ విపరీతంగా పెరుగుతుంది. విజువల్‌గా గ్రాండ్‌గా ఉన్నప్పటికీ ఈ సీక్వెన్స్ కథకు సహజంగా సరిపోకుండా ఓవర్ ది టాప్‌గా అనిపిస్తుంది.
విజయ్ వన్ మ్యాన్ షో
సినిమాకు అతిపెద్ద బలం విజయ్. వెట్రి కొండన్ పాత్రలో తన మార్క్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, పంచ్ డైలాగులు, డ్యాన్స్.. అన్నింటిలోనూ అభిమానులకు కావాల్సిన విజయ్ కనిపిస్తాడు. ఇది ఆయన చివరి సినిమా అనే భావనతో చూసే అభిమానులకు కొన్ని సన్నివేశాలు మరింత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
- బాబీ డియోల్ విలన్‌గా గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. విజయ్‌కు ఎదురుగా నిలబడే స్థాయిలో అతడి పాత్రకు ఎలివేషన్ ఇచ్చారు.
- విజ్జిగా మమితా బైజుకు కథలో కీలక పాత్ర దక్కింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. అయితే ‘భగవంత్ కేసరి’లో ఇదే తరహా పాత్ర చేసిన శ్రీలీలతో పోలికలు రావడం సహజం.
- పూజా హెగ్డే అందంగా కనిపించినప్పటికీ నటనకు పెద్దగా స్కోప్ దక్కలేదు. గౌతమ్ మీనన్, ప్రకాశ్ రాజ్, రేవతి, నాజర్, ప్రియమణి తదితరులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే?
అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్. పాటల కంటే కొన్ని యాక్షన్, ఎలివేషన్ సీన్లలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రభావం చూపిస్తుంది.
సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకొచ్చింది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను విజువల్‌గా రిచ్‌గా చూపించారు.
ఫైనల్‌గా..
విజయ్ ఫ్యాన్స్‌కు ఎలివేషన్స్, డ్యాన్స్, యాక్షన్, పొలిటికల్ పంచ్‌లు కావాల్సినంత ఉన్నాయి. సాధారణ ప్రేక్షకుడికి మాత్రం అధిక నిడివి, తెలిసిన కథ, లాజిక్‌లేని యాక్షన్, ఎక్కువైన పొలిటికల్ మెసేజ్‌లు మైనస్‌గా మారతాయి.
ప్లస్ పాయింట్స్: విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, బాబీ డియోల్, భారీ యాక్షన్ బ్లాక్స్, అనిరుధ్ BGM, నిర్మాణ విలువలు.
మైనస్ పాయింట్స్: తెలిసిన కథ, అధిక నిడివి, సెకండాఫ్‌లో ఓవర్ డోస్ యాక్షన్, ఎక్కువైన పొలిటికల్ మెసేజ్‌లు, క్లైమాక్స్.








