చంద్రబాబు (Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయ్యాక రైతుల జీవితం పూర్తిగా తిరోగమనమైందని, గత 18 నెలల్లో 16 సార్లు అతివృష్టి–అనావృష్టి (Heavy Rains – Drought) కారణంగా రైతులు (Farmers) భారీ నష్టాలు చవిచూశారని మాజీ సీఎం వైఎస్ (Former CM) జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) అన్నారు. వైయస్సార్ కడప జిల్లా (YSR Kadapa district) బ్రాహ్మణపల్లి (Brahmanapalli) వద్ద అరటి రైతులను (Banana Farmers) పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. రైతులు నష్టపోతున్నా, ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ (Input Subsidy) రూపంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాజా మొ౦థా తుపాన్ (Montha Storm) నష్టాన్ని కూడా ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తూ, ఇవ్వాల్సిన రూ.1100 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొడుతోందని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో 80 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా అందించగా, ఇప్పుడు రాష్ట్రంలో 84 లక్షల మంది రైతుల్లో కేవలం 18 లక్షల మందికి మాత్రమే బీమా కల్పించారని చెప్పారు. ఈ–క్రాప్ నమోదు లేకపోవడంతో రైతులు తమ హక్కులను కోల్పోతున్నారని ఆయన మండిపడ్డారు. పెట్టుబడి సాయం లేకుండా, ఎరువులు బ్లాక్‌లలో కొనాల్సిన పరిస్థితి రావడమే కాకుండా, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాల్లో మునిగిపోయారని విమర్శించారు.
అరటి రైతు అవస్థలు
అరటి ధరలు పతనం కావడంపై జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో అరటికి టన్నుకు సగటు రూ.25 వేల నుంచి రూ.32 వేల వరకు ధర ఉండేదని, అదే ఇప్పుడు రూ.2 వేలకూ కొనడం లేదని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఎగుమతులను పెంచేందుకు తన ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు నడిపిన విషయం గుర్తుచేశారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏ చర్యలు తీసుకోకుండా, సమస్య వచ్చిన ప్రతిసారీ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని, రైతులను మోసం చేస్తోందని విమర్శించారు.
అన్నింటా మోసం..
చంద్రబాబు గవర్నెన్స్‌పై జగన్ మరింత తీవ్రంగా స్పందించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, పెన్షన్లలో భారీ కోతలు, నిరుద్యోగ భృతి మరియు మహిళల పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వనరులు, గనులు, ఆస్తుల అమ్మకంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని, గద్దె దింపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జగన్ అన్నారు.








