ఇండిగో (IndiGo) విమాన సేవల (Air Services)సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) పనితీరును మాజీ ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat) తీవ్రంగా తప్పుబట్టారు. విజయవంతంగా నడుస్తున్న విమానయాన వ్యవస్థను మంత్రి నిర్లక్ష్యం, తప్పుదారి పట్టించే చర్యలతో దేశవ్యాప్తంగా అస్తవ్యస్తం చేశారంటూ భరత్ ఆరోపించారు. రోజుకు 2300 ఇండిగో విమానాలు నడుస్తున్న నేపథ్యంలో వందలాది సర్వీసులు వరుసగా రద్దవుతున్నాయంటే, దీనిపై కేంద్ర మంత్రి స్పందించకపోవడం ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రపంచ స్థాయిలో భారత దేశ పరువును తీసేస్తున్నాడని ఆరోపించారు.
భరత్ మాట్లాడుతూ.. ఇండిగో సంక్షోభానికి అసలైన కారణాలపై సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఎలాంటి పీరియాడిక్ రివ్యూలు నిర్వహించలేదని విమర్శించారు. నిబంధన ప్రకారం ఇండిగోకు అదనంగా 900 మంది పైలెట్లు ఉండాలి. అయితే ఈ నియమాలను అమలు చేయించడంలో కేంద్ర మంత్రిత్వ శాఖ పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. గగనతల భద్రతను కాదని, నిబంధనలు అర్ధాంతరంగా అమలు చేయించడం వల్లనే ఈ స్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రయాణికుల భద్రతను గాలికొదిలేశారని ఆరోపించిన మార్గాని భరత్, షిల్లాంగ్‌లో భర్త మృతదేహంతో ఒక మహిళ 48 గంటలు ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిపోవడం వంటి సంఘటనలు విమానయాన శాఖ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. అహ్మదాబాద్ ఫ్లైట్ ఘటన ఇంకా ప్రజల మదిలో ఉన్నప్పటికీ, మంత్రి నిర్లక్ష్యం కొనసాగుతుండటం ఆశ్చర్యకరమన్నారు. రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ స్థాయి సమస్యలు రావడం దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని అన్నారు.
ఇండిగో సర్వీసుల రద్దుతో అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వివాహాలు కూడా ఆన్లైన్‌లో చేసుకునే పరిస్థితి వచ్చిందని భరత్ విమర్శించారు. ఈ సంఘటనలన్నీ మంత్రిత్వ శాఖ సక్రమంగా పనిచేయకపోవడానికి ఉదాహరణలేనన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానపరిచేలా రామ్మోహన్ నాయుడు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించి, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్