ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శనివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో ఇరాన్ను 37-34తో ఓడించి భారత్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 22-16తో ఆధిక్యంలో ఉన్న భారత్కు రెండో అర్ధభాగంలో ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
ఒక దశలో ఇరాన్ 27-26తో ఆధిక్యంలోకి రావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే కీలక సమయంలో భారత ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించారు. చివరి నిమిషాల్లో ఒత్తిడిని అధిగమించి 37-34తో విజయం సాధించి టైటిల్ను నిలబెట్టుకున్నారు.
ఈ విజయంతో ఆసియా క్రీడల మహిళల కబడ్డీలో భారత్ నాలుగో స్వర్ణ పతకాన్ని సాధించింది. 2010, 2014, 2022లోనూ భారత మహిళల జట్టు పసిడి పతకాలు గెలుచుకుంది. 2018లో రజతంతో సరిపెట్టుకున్న భారత్.. తాజా విజయంతో మరోసారి ఆసియా క్రీడల్లో తన కబడ్డీ ఆధిపత్యాన్ని చాటుకుంది.








