దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రతిపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం (ECI)కి వ్యతిరేకంగా భారీ ఆందోళన చేపట్టారు. దేశంలో ఓటర్ల డేటా దుర్వినియోగం, ఓట్ల తొలగింపు (ఓటు చోరీ) ఆరోపణలతో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞనేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ప్రజాప్రతినిధులు రోడ్డెక్కారు.
‘సేవ్ డెమొక్రసీ’ నినాదంతో పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని మకరద్వారం నుంచి నిర్వచన్ సదన్ (ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం) వరకు ఎంపీలు భారీ నిరసన ర్యాలీగా బయలుదేరారు.
విపక్ష ఎంపీల ఈసీ కార్యాలయ ముట్టడి పిలుపుతో ఢిల్లీ పోలీసులు నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఆంక్షలు విధించారు. నిర్వాచన్ సదన్, జంతర్ మంతర్ మరియు పార్లమెంట్ వైపు వెళ్లే అన్ని ప్రధాన రహదారులను బారికేడ్లతో మూసివేశారు.
ముందస్తు జాగ్రత్త చర్యగా, నిరసనలు ఉధృతం కాకుండా ఉండేందుకు పార్లమెంట్ పరిసర ప్రాంతాలు, సెంట్రల్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు, మొబైల్ డేటాను అధికారులు నిలిపివేశారు. పార్లమెంట్ భవనానికి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు, పారామిలటరీ దళాలు తమ ఆధీనంలోకి తీసుకుని ట్రాఫిక్‌ను మళ్లించారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ రాజ్యాంగబద్ధమైన సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞనేష్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, విపక్షాలు లేవనెత్తుతున్న ఓట్ల లెక్కింపు, డేటా వ్యత్యాసాలపై సమగ్ర విచారణ జరిపించాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు.
ఈసీ ఆఫీస్ వైపు దూసుకెళ్తున్న ఎంపీలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఢిల్లీ వీధుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.








