ఏపీ ఇసుక మాఫియా.. తెలంగాణలో గుట్టుర‌ట్టు

ఏపీ ఇసుక మాఫియా.. తెలంగాణలో గుట్టుర‌ట్టు

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ (Andhra Pradesh-Telangana) సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా(llegal Sand Transport) మాఫియా రెచ్చిపోతోంది. ఏపీ ప్రభుత్వ ‘ఉచిత ఇసుక’ విధానాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు కేటుగాళ్లు పక్క రాష్ట్రమైన తెలంగాణకు ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో భారీ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది.

కొవ్వూరు గోదావరి నది ఇసుక ర్యాంప్‌ల నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలుతోంది. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కడప గ్రామానికి చెందిన పాటిబండ్ల పార్థసారథి చౌదరి అనే వ్యక్తి ఈ అక్రమ రవాణాకు సూత్రధారిగా మారాడు. ఏపీలో ఉచితంగా లభించే ఇసుకను పొరుగు రాష్ట్రంలో భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.

అక్రమ రవాణా సాగుతోందిలా..
పార్థసారథి చౌదరి కేవలం వ్యక్తిగతంగా కాకుండా, మధ్యవర్తులను పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం (Organized manner) ఈ దందాను నడిపిస్తున్నాడు. 3 లారీల ద్వారా నిరంతరం ఇసుకను తరలిస్తూ తెలంగాణలోని ఖమ్మం జిల్లా సరిహద్దు మండలాలైన సత్తుపల్లి, వేంసూర్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. తెలంగాణ మైనింగ్ చట్టాలను ఉల్లంఘిస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

ఎనిమిది కేసులు.. తాజా అరెస్ట్
పార్థసారథి చౌదరి ఆగడాలపై నిఘా ఉంచిన ఖమ్మం జిల్లా పోలీసులు గతంలోనే అతన్ని పలుమార్లు పట్టుకున్నారు. ఇప్పటివరకు అతనిపై ఏకంగా ఎనిమిది కేసులు నమోదయ్యాయంటే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పోలీసుల విచారణలో పార్థసారథికి కుడిభుజంగా వ్యవహరిస్తున్న ఆముదాల మధు అనే మధ్యవర్తి ప్రమేయం కూడా బయటపడింది. వీరిద్దరూ కలిసి నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు ఆధారాలు లభించాయి. తాజా విచారణ అనంతరం పార్థసారథి, ఆముదాల మధుపై పోలీసులు చీటింగ్ (420), ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు నమోదు చేశారు.

సరిహద్దుల్లో పెరిగిన నిఘా
ఏపీ ఉచిత ఇసుక పాలసీని కొంతమంది స్వార్థపరులు దుర్వినియోగం చేస్తూ తెలంగాణలో బ్లాక్ మార్కెట్‌ను సృష్టిస్తున్నారు. ఖమ్మం పోలీసులు సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సహకరించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment