హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒంటరితనం, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లా గోవిందపల్లికి చెందిన బక్కశెట్టి సింధూజ అలియాస్ తుషారిక (36) హైటెక్ సిటీలోని నెక్స్ట్‌టర్న్ కంపెనీలో పనిచేస్తూ మియాపూర్‌లోని ప్రజయ్ మెగాపోలిస్ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివాసముంటోంది. 2015లో వివాహమైన ఆమె ఏడాదిన్నర తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకుని అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తోంది. గురువారం ఉదయం ఆమెకు సహోద్యోగి రాజీరెడ్డి ఫోన్ చేయగా స్పందించకపోవడంతో ఫ్లాట్‌కు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
పోలీసులకు లభించిన సూసైడ్ నోట్‌లో గత నాలుగు నెలలుగా ఒంటరితనం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు సింధూజ పేర్కొన్నట్లు సమాచారం. తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, బ్యాంకు ఖాతాలోని డబ్బులను అనాథ పిల్లలకు అందించాలని కోరింది. అలాగే కోర్టులో వివాదంలో ఉన్న ఆస్తికి సంబంధించిన కేసులను కొనసాగించాలని, తన ఆస్తి మొత్తాన్ని కేర్ ట్రస్ట్‌కు అందేలా చూడాలని సూసైడ్ నోట్‌లో రాసింది. మియాపూర్ ఎస్‌ఐ నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.








