నెల గడిచినా.. న్యాయం ఎక్కడ?

నెల గడిచినా.. న్యాయం ఎక్కడ?

Summarize with AI

హైదరాబాద్ మాదాపూర్‌లో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో 26 ఏళ్ల భారతి ముఖి మృతి చెంది నేటికి 30 రోజులు పూర్తయ్యాయి. నెల రోజులు గడుస్తున్నా తమకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదని భారతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు, డ్రైవర్‌ ఎవరో కూడా తమకు పూర్తిగా తెలియదని.. కేసు దర్యాప్తు ఏ దశలో ఉందో పోలీసులు తమకు చెప్పలేదని భారతి అన్న రజినీకాంత్‌ వాపోయారు.

ఈ కేసులో జనసేన ఎంపీ లింగంనేని రమేశ్‌ కుమారుడు లింగంనేని సంజూష్‌ నిందితుడిగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్‌ చేయక‌పోవ‌డం పోలీసుల తీరుపై విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. యాక్సిడెంట్ చేసి యువ‌తిని చంపిన సంజూష్ కుటుంబంతో క‌లిసి వినాయ‌క చ‌వితి వేడుక‌లు జ‌రుపుకుంటుంటే.. కూతుర్ని పోగొట్టుకున్న బాధిత త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

జ‌న‌సేన ఎంపీ లింగ‌మ‌నేని ర‌మేష్ కొడుకు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిస్థితి ఏమిటి? దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి.

ఆడ‌పిల్ల‌ల ర‌క్ష‌ణ గురించి వేదిక‌ల‌పై సూక్తులు, ప్ర‌వ‌చ‌నాలు చెప్పే ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న పార్టీకి చెందిన ఏకైక రాజ్య‌స‌భ స‌భ్యుడి కుమారుడు ఓ యువ‌తి ప్రాణం తీస్తే.. క‌నీసం స్పందించ‌క‌పోవ‌డంపై జ‌నం, నెటిజ‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

పేద కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భారతి
భారతి ముఖి ఒడిశాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబంలో పుట్టింది. పేదరికంలో ఉన్న కుటుంబానికి ఆమె పెద్ద దిక్కుగా నిలిచింది. మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లో ప‌నిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తోంది. అయితే కాస్ట్‌లీ కారులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ జ‌న‌సేన ఎంపీ కొడుకు చేసిన ప్రమాదంలో భార‌తి మృతి చెందడంతో కుటుంబం దిక్కులేని పరిస్థితిలో పడిపోయింది. చెల్లెలి మరణంతో తమ తల్లి తీవ్రంగా కుంగిపోయి మంచానికే పరిమితమైందని అన్న‌ రజినీకాంత్ క‌న్నీరుపెట్టుకున్నారు.

భారతి కుటుంబాన్ని ఈ విష‌య‌మై క‌దిలించ‌గా, వారు తమ దీనస్థితిని వివరించారు. ‘‘మాకు హైదరాబాద్‌ ఎక్కడో కూడా తెలియదు. న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో కూడా తెలియడం లేదు’’ అంటూ రజినీకాంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి న్యాయం కోసం పోరాడే ఆర్థిక స్థోమత కూడా లేదని ఆయన తెలిపారు. చెల్లెలి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా అప్పు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇంతటి పేద కుటుంబానికి ఇప్పటివరకు న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌డం దారుణ‌మంటున్నారు ప్ర‌జ‌లు.

సంప‌న్నుల కుటుంబానికి ఒక న్యాయం.. నిరుపేద భార‌తి కుటుంబానికి మ‌రో న్యాయ‌మా..? అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. యువ‌తి మృతికి కార‌ణ‌మైన నేర‌స్తుడు ద‌ర్జాగా తిరుగుతుంటే.. కుటుంబానికి ఆర్థికంగా పెద్ద దిక్కుగా ఉన్న కూతుర్ని కోల్పోయిన కుటుంబానికి మ‌రింత దీనావ‌స్థ‌లో కొట్టుమిట్టాడుతోంది. రాజ‌కీయ ప‌లుకుబ‌డి, డ‌బ్బున్న కుటుంబం అయితే మ‌నిషిని చంపేసినా.. ప‌ర్వాలేదా అని నిల‌దీస్తున్నారు. నిందితుడు సంజూష్ కుటుంబంతో క‌లిసి వినాయ‌క చ‌వితి వేడుక‌ల్లో పాల్గొంటూ వీడియోలు విడుద‌ల చేస్తుండ‌గా, నెల గ‌డిచినా అరెస్ట్ చేయ‌క‌పోవ‌డంపై నెటిజ‌న్ల నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.

ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఏమైంది? అందులో ఏమి నమోదైంది? కేసులో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు సేకరించారు? నిందితుడిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉందని డిమాండ్ చేస్తున్నారు. ‘‘30 రోజులు గడిచినా కేసు ఏ దశలో ఉందో మాకు తెలియదు. మా చెల్లెలికి న్యాయం కావాలి. కానీ దాని కోసం ఎవరిని కలవాలో, ఎలా పోరాడాలో కూడా మాకు తెలియడం లేదు’’ అంటూ రజినీకాంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment