హైదరాబాద్ (Hyderabad) ఐటీ హబ్ (IT Hub)గా పేరుగాంచిన నగరం. అయితే ఈ పేరు వెనుక దాగి ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయి. తాజాగా మాదాపూర్ (Madhapur)లో ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చి, నిరుద్యోగులను భయాందోళనలకు గురిచేస్తోంది.
NSN ఇన్ఫోటెక్ (NSN Infotech) పేరుతో పనిచేసిన ఒక సంస్థ 400 మంది ఉద్యోగార్ధులపై పెద్ద ఎత్తున మోసం చేసినట్లు బయటపడింది. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామని నమ్మబలికి, ప్రతి అభ్యర్థి నుండి రూ.3 లక్షల నుండి పైగా వసూలు చేసింది. ఐటీ ఉద్యోగం (IT Job) దొరుకుతుందని నమ్మిన యువత తమ సొమ్మును లక్షల్లో పెట్టుబడి పెట్టారు.
బోర్డు తిప్పేసి కంపెనీ అధినేత పరార్
డబ్బులు సేకరించిన కొద్దికాలానికే, కంపెనీ అధినేత స్వామినాయుడు (Swaminayudu) బోర్డు తిప్పేసి పరారయ్యాడని బాధితులు చెబుతున్నారు. దాంతో ఉద్యోగం కోల్పోయిన వాళ్లు మాత్రమే కాదు, తమ డబ్బులు కూడా పోయాయని బాధపడుతున్నారు. వీరంతా కలిసి సైబరాబాద్ కమిషనరేట్‌కు వెళ్లి సంస్థపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కంపెనీ నిర్వాహకుల కోసం గాలింపును ప్రారంభించారు. ఈ ఘటనతో ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్న యువత మరోసారి ఆందోళనకు గురవుతున్నారు.








