ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో దళిత మహిళలపై పోలీసు సిబ్బంది దాడి చేశారన్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా స్పందించింది. మీడియాలో వచ్చిన నివేదికల ఆధారంగా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి గురువారం విచారణ చేపట్టింది. మొక్కజొన్న పంటకు MSP ఇవ్వాలని కోరినందుకు పోలీసులే మహిళలపై హింసకు పాల్పడటం, అధికార దుర్వినియోగానికి ఒడిగట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కమిషన్ స్పష్టం చేసింది. ఈ విషయంపై బాధిత మహిళలతో కలిసి వైసీపీ ఎంపీలు జాతీ మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు సైతం చేశారు.
ఈ దారుణ ఘటనపై ఎన్సీడబ్ల్యు ఛైర్పర్సన్ విజయ రహత్కర్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ఘాటైన లేఖ రాశారు. ఈ విషయంపై తక్షణమే, నిష్పక్షపాతంగా, ఒక నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు జరిగేలా చూడాలని ఆమె ఆదేశించారు. అంతేకాకుండా, రాబోయే ఏడు రోజుల్లోగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ‘కార్యాచరణ నివేదిక’ సమర్పించాలని స్పష్టం చేశారు.
భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత నిబంధనల ప్రకారం నిందితులైన పోలీసులపై ఎలాంటి కేసులు నమోదు చేశారు? బాధ్యులుగా తేలిన అధికారులపై తీసుకున్న క్రమశిక్షణా, శాఖాపరమైన చర్యల వివరాలు ఏంటి? బాధితులైన మహిళలపై కానీ, వారి కుటుంబాలపై కానీ తదుపరి వేధింపులు, బెదిరింపులు రాకుండా తీసుకున్న రక్షణ చర్యలు ఏంటి? బాధితులకు అందిస్తున్న కౌన్సెలింగ్, పునరావాసం, ఉచిత న్యాయ సహాయం వివరాలు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, ముఖ్యంగా ఎస్సీ, ఇతర బలహీన వర్గాల మహిళల రక్షణల కోసం పోలీసు శాఖలో తీసుకుంటున్న చట్టపరమైన చర్యలు ఏంటి అని ప్రశ్నలు వేసింది.
దళిత మహిళలపై పోలీసులే దారుణాలకు ఒడిగట్టడంపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించి విచారించడం సంచలనంగా మారింది. మొక్కజొన్న పంటకు MSP ఇవ్వాలని కోరినందుకు రైతులు, ఎస్సీ మహిళలపై దాడులు చేసింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో చాలా గ్రామాల్లో ఈ వివక్ష, అరాచక పాలన సాగుతోందని వైసీపీ మండిపడుతోంది. ఈ ఘటనలపై నివేదిక తీసుకుని మానవహక్కుల సంఘం వీరందరికీ న్యాయం చేయాలని కోరుతున్నామని వైసీపీ ఎంపీలు పేర్కొన్నారు.
మహిళల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని, బాధ్యులెంతటి వారైనా చట్టప్రకారం కఠినమైన జవాబుదారీతనం ఎదుర్కోవాల్సిందేనని జాతీయ మహిళా కమిషన్ తేల్చిచెప్పింది.








