ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మరోసారి తమ సత్తా చాటింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో(Narendra Modi Stadium) చెన్నై సూపర్ కింగ్స్‌తో(CSK) జరిగిన కీలక పోరులో గుజరాత్ 229 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి ఘన విజయం సాధించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (84), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (64) తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. అనంతరం జోస్ బట్లర్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో గుజరాత్ స్కోరును మరింత భారీగా మార్చాడు. ఈ విజయంతో గుజరాత్ ప్లేఆఫ్స్ (Playoffs) టాప్-2 స్థానాన్ని అధికారికంగా ఖరారు చేసుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) జట్టు ప్రదర్శనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. ఢిల్లీపై (Delhi) సాధించిన విజయమే తమ సీజన్‌కు టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్న గిల్, అప్పటి నుంచి జట్టు వెనక్కి తిరిగి చూడలేదని చెప్పాడు. అహ్మదాబాద్ పిచ్‌పై సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడమే తమ బౌలర్ల విజయ రహస్యం అని వివరించాడు. అలాగే ప్లేఆఫ్స్ ముందు జట్టులో పెద్దగా మార్పులు అవసరం లేదని, ఇప్పటివరకు చేస్తున్న మంచి విషయాలను అదే స్థాయిలో కొనసాగిస్తే సరిపోతుందని ధీమా వ్యక్తం చేశాడు. గత సీజన్‌లో ఇదే వేదికపై ఎదురైన చేదు అనుభవాలు గుర్తున్నప్పటికీ, ఈసారి మాత్రం జట్టు చాలా క్రమశిక్షణతో ఆడుతోందని గిల్ తెలిపాడు.







