‘త్వ‌ర‌లో డీఎస్సీ’.. ఈసారైనా నోటిఫికేష‌న్‌ వ‌చ్చేనా..?

'త్వ‌ర‌లో డీఎస్సీ'.. ఈసారైనా నోటిఫికేష‌న్‌ వ‌చ్చేనా..?

ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

నిరుద్యోగుల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంత‌కం అని చెప్పి కూట‌మి ప్ర‌భుత్వం.. తొమ్మిది నెల‌లు దాటిపోయినా ఇప్ప‌టికీ నోటిఫికేష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డంతో నిరుద్యోగులు భ‌గ్గుమంటున్నారు. మొద‌ట పోస్టుల లెక్కింపు అని హ‌డావిడి చేసినా త‌రువాత టెట్ ఫ‌లితాల‌తో ముడిపెట్టారు. ఆ త‌రువాత ఎస్సీ రిజ‌ర్వేష‌న్‌, ఆ త‌రువాత‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్‌ను బూచీగా చూపారు. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత అమ‌లు కావాల్సిన హామీ 9 నెల‌లు అయినా అమ‌లుకు నోచుకోక‌పోగా, ప్ర‌భుత్వ ప్ర‌చారానికి మాత్రం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అయితే డీఎస్సీ నోటిఫికేష‌న్ కోసం ప్రైవేట్ ఉద్యోగాల‌ను మానుకొని మ‌రీ నిరుద్యోగులు కోచింగ్‌ల‌కు వెళ్తున్నారు. నేటి వ‌ర‌కు నోటిఫికేష‌న్‌విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హంతో ఉన్నారు. అదే విధంగా బ‌డ్జెట్‌లో నిరుద్యోగ భృతికి సంబంధించి పైసా కూడా కేటాయించ‌క‌పోవ‌డంపై కూడ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వంపై నిరుద్యోగుల్లో వ్య‌తిరేక‌త పెరిగిపోతోంది. మంత్రి మండ‌లి సాక్షిగా ఇచ్చిన హామీపై కూడా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్య‌ర్థులు అనుమానాలు వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

త్వ‌ర‌లో త‌ల్లికి వంద‌నం గైడ్‌లైన్స్‌
ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన త‌ల్లికి వంద‌నం పథకాన్ని త్వరలోనే అమలుచేస్తామ‌ని ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్ లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.

త‌ల్లిదండ్రుల ఆగ్ర‌హం..
ప్ర‌భుత్వ ప‌గ్గాలు చేప‌ట్ట‌గానే త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం అమ‌లు చేస్తామ‌ని, కుటుంబంలో ఎంత‌మంది చ‌దువుకునే విద్యార్థులు ఉంటే.. అంత‌మందికి రూ.15 వేల చొప్పున అందిస్తామ‌ని కూట‌మి నేత‌లు ప్ర‌క‌టించారు. నీకు 15 వేలు, నీకు 15 వేలు, నీకు 15 వేలు అని ప్ర‌క‌టించిన‌ మంత్రి నిమ్మ‌ల వీడియో ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. కూట‌మి అధికారంలోకి వ‌చ్చి ఒక‌ విద్యా సంవ‌త్స‌రం గ‌డిచిపోతున్న‌ప్ప‌టికీ త‌ల్లికి వంద‌నం అమ‌లు కాక‌పోవ‌డంపై విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కానికి రూ.12,450 కోట్లు అవ‌స‌రం కాగా, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రూ.9,407 కోట్లు మాత్ర‌మే కేటాయించ‌డంతో హామీ అమ‌లులో ఏమైనా కొర్రీలు పెడ‌తారా..? అనే అనుమానం క‌లుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment