తండ్రి మందలించాడని కోపంతో ఇల్లు వదిలి, ఏకంగా 100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి, ఊరు కాని ఊరు వెళ్లిన ఒక బాలుడి ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వరకు రాత్రంతా సైకిల్ తొక్కి, అక్కడి నుంచి రాయచూర్‌కు రైలులో వెళ్లిన ఆ బాలుడి సాహసం చూస్తుంటే.. నేటి ‘జెన్-జీ’ (Gen-Z) పిల్లల్లో పెరుగుతున్న అసహనం స్పష్టంగా కనిపిస్తోంది.
ఏం జరిగింది?
ప్రొద్దుటూరుకు చెందిన ఓ బాలుడిని తండ్రి ఏదో విషయంలో మందలించారు. ఆ చిన్న కోపాన్ని తట్టుకోలేకపోయిన సదరు బాలుడు, రాత్రికి రాత్రే తన సైకిల్ తీసుకుని బయలుదేరాడు. దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నంద్యాలకు చేరుకున్నాడు. అక్కడ సైకిల్ అమ్మే ప్రయత్నం చేయగా, దుకాణదారుడికి అనుమానం రావడంతో భయపడి రైల్వే స్టేషన్‌కు వెళ్లి, రైలెక్కి కర్ణాటకలోని రాయచూర్ చేరుకున్నాడు. చివరకు పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా గాలించి ఆ బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
మానసిక సున్నితత్వం
ఈ ఘటన కేవలం ఒక అల్లరి పిల్లోడి కథ మాత్రమే కాదు, సమాజంలో మారుతున్న మనుషుల ప్రవర్తనకు నిదర్శనం. క్రమశిక్షణను శిక్షగా భావించడం. తండ్రి మందలించడం అంటే అది తన క్షేమం కోసమేనని గ్రహించే విచక్షణ పిల్లల్లో లోపిస్తోంది. చిన్నపాటి విమర్శను లేదా కోపాన్ని తట్టుకునే శక్తి (Resilience) నేటి పిల్లల్లో తగ్గిపోతోంది. బాలుడి వద్ద ఫోన్ లేకపోవడం వల్ల పోలీసులు వెతకడం కష్టమైంది, కానీ అసలు సమస్య ఏమిటంటే.. ఆ పిల్లాడు తన భావాలను పంచుకోవడానికి ఇంట్లో స్వేచ్ఛ లేదా సాన్నిహిత్యం లేకపోవడం.
తల్లిదండ్రుల బాధ్యత
తప్పు జరిగినప్పుడు సరిదిద్దడం తండ్రిగా ఆయన బాధ్యత. అది తిట్టడం కాదు, రేపటి సమాజంలో ఆ పిల్లాడు నిలబడటానికి చేసే ఒక చిన్న మార్గదర్శకం. “జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, అవమానాలు, కష్టాల ముందు తండ్రి వేసే కేక చాలా చిన్నది. ఇంట్లోనే చిన్న మందలింపును భరించలేకపోతే, రేపు సమాజం విసిరే సవాళ్లను ఈ తరం ఎలా ఎదుర్కోగలదు?”
పిల్లలకు సౌకర్యాలతో పాటు, ‘ఓటమిని, విమర్శను’ తట్టుకునే మానసిక స్థైర్యాన్ని కూడా నేర్పాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉంది. అదే సమయంలో పిల్లలు కూడా తమ క్షేమం కోరేది తల్లిదండ్రులేనని గుర్తించాలి. చిన్న కోపానికి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం లేదా ఇల్లు వదిలి వెళ్లడం వంటి నిర్ణయాలు.. జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాయి.








