బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను శనివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్’ వద్ద ఆయన్ను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మూడు రోజులుగా తెలంగాణ భవన్‌లోనే ఉంటున్న సుమన్‌ను ఏసీపీ ప్రవీణ్ నేతృత్వంలోని పోలీసు బృందం అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించింది.
తెలంగాణ భవన్ వద్ద భారీ ఉద్రిక్తత
బాల్క సుమన్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు తెలంగాణ భవన్‌ను చుట్టుముట్టగా, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ వాగ్వాదానికి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి, సుమన్ తరఫు లాయర్ సమక్షంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
గత మంగళవారం (మే 26) తెలంగాణ భవన్లో జరిగిన బొగ్గు గని కార్మికుల సమావేశంలో బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “సింగరేణి భవన్‌ను తగలబెట్టండి.. మిలిటెంట్ తరహా పోరాటాలు చేయాలి.. అవసరమైతే నెల రోజులు జైలుకు పోయి వద్దాం” అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సుమన్‌పై నమోదైన సెక్షన్లు ఇవే..
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రసంగించడం, హింసను ప్రేరేపించడం వంటి ఆరోపణలపై నాంపల్లి పోలీసులు సుమన్‌పై కేసు నమోదు చేశారు. ఆయనపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 326(g), 351(3), 353(1)(b) తో పాటు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ (PDPPA) కింద కఠినమైన సెక్షన్లను ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు.








