సినిమా రంగంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి వందల కోట్ల వసూళ్లు సాధించే సినిమాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. 2009లో వచ్చిన ‘పారానార్మల్ యాక్టివిటీ’ తర్వాత మళ్లీ ఆ స్థాయి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ, హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది ‘అబ్సెషన్’ మూవీ. యూట్యూబర్ అయిన 26 ఏళ్ల యంగ్ డైరెక్టర్ కర్రీ బార్కర్ (Curry Barker) తెరకెక్కించిన ఈ చిత్రం హారర్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ చిత్రాన్ని కేవలం $750,000 (సుమారు రూ. 6.2 కోట్లు) బడ్జెట్‌తో అత్యంత సాధారణంగా నిర్మించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా కంటెంట్ చూసి ఫిదా అయిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఫోకస్ ఫీచర్స్’ (Focus Features), బ్లమ్‌హౌస్ కలిసి దీని థియేట్రికల్ రైట్స్‌ను సుమారు $14 మిలియన్ల నుండి $15 మిలియన్లకు దక్కించుకున్నాయి.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న రికార్డులు ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా హారర్ సినిమాలకు మొదటి వారాంతం (First Weekend) కంటే రెండో వారాంతంలో వసూళ్లు పడిపోతాయి. కానీ ‘అబ్సెషన్’ విషయంలో సీన్ రివర్స్ అయింది. అమెరికాలో తొలి వీకెండ్‌లో $16.1 మిలియన్ల కలెక్షన్లతో అకౌంట్ ఓపెన్ చేసింది. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో రెండో వారంలో ఏకంగా 30% గ్రోత్ చూపిస్తూ $22.4 మిలియన్లు రాబట్టింది.
హాలీవుడ్ హిస్టరీలోనే ఒక హారర్ సినిమాకు రెండో వారంలో ఈ స్థాయి ఎదుగుదల నమోదు కావడం అత్యంత అరుదు. ప్రస్తుతం ఈ సినిమా అమెరికాలోనే దాదాపు $73 మిలియన్లకు పైగా వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా $75 మిలియన్ల (సుమారు రూ. 620 కోట్లు) మార్కును దాటేసింది. అతి త్వరలోనే ఇది $100 మిలియన్ల క్లబ్‌లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్టిన పెట్టుబడికి వంద రెట్లకు పైగా లాభాలను తెచ్చిపెడుతూ ఈ ఏడాది అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది.
ఒక నిరాశాజనకమైన ప్రేమికుడు (బేర్) తాను ఇష్టపడిన అమ్మాయి (నిక్కీ) మనసు గెలుచుకోవడానికి “వన్-విష్ విల్లో” (One-Wish Willow) అనే ఒక రహస్యమైన వస్తువును ఉపయోగించి కోరిక కోరుకుంటాడు. మొదట తను అనుకున్నది జరిగినట్లే అనిపించినా.. ఆ కోరిక వెనుక ఎంతటి భయంకరమైన, చీకటి కోణం దాగి ఉందనేదే ఈ సినిమా కథ.








