దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాల్కాజీ మందిరం సమీపంలోని ఆస్తా కుంజ్ పార్కులో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తాము పోలీసులమని చెప్పి బాలికను, ఆమెతో ఉన్న స్నేహితుడిని బెదిరించిన నిందితులు ఈ ఘటనకు పాల్పడినట్లు నిజమైన పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం..
బాధిత బాలిక సోమవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో తన 17 ఏళ్ల స్నేహితుడితో కలిసి కాల్కాజీ మందిరానికి వెళ్లింది. అక్కడ పూజలు ముగించుకున్న అనంతరం ఇద్దరూ సుమారు 7:30 గంటలకు సమీపంలోని ఆస్తా కుంజ్ పార్కుకు వెళ్లారు. అదే సమయంలో 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. తాము పోలీసులమని పరిచయం చేసుకుని బాలిక, ఆమె స్నేహితుడిని కత్తితో బెదిరించి, బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటనకు సంబంధించి రాత్రి సుమారు 8:45 గంటలకు పోలీసులకు PCR కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. బాలిక ఫిర్యాదు, వాంగ్మూలం ఆధారంగా పోక్సో చట్టంతో పాటు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పార్కు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఒక నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతడు పోలీసులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నిందితుడి కాలికి బుల్లెట్ తగిలింది. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఆసిఫ్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడు ఓక్లా మండికి చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు ఘటన జరిగిన సమయంలో పార్కు, పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కేసులో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.








