ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ దాడికి తెగబడిన ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) వడ్డేపల్లి మండలం పైపాడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ప్రోటోకాల్ వివాదం తలెత్తి, అది భౌతిక దాడికి దారి తీసింది. ఈ ఘటనలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (Congress MP Mallu Ravi), అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి (Alampur BRS MLA Vijayudu)పై రెచ్చిపోయి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు ఎంపీ మల్లు రవి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్(Sampath Kumar) హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లు రవి ముందుగా కొబ్బరికాయ కొట్టారు. అనంతరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించగా, ప్రోటోకాల్ లేని వ్యక్తులతో కొబ్బరికాయ ఎలా కొట్టిస్తారని ఎమ్మెల్యే విజయుడు ప్రశ్నించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లు రవి “ఎవడ్రా నువ్వు?” అంటూ దూషిస్తూ, ఎమ్మెల్యే విజయుడిపై దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
బీఆర్ఎస్ ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలని ట్వీట్
ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి మల్లు రవి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ, ప్రాంతంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల అరాచకానికి ఇది పరాకాష్ట అని, ఒక దళిత ఎమ్మెల్యేపై భౌతిక దాడి చేయడం హేయమైన చర్యగా బీఆర్ఎస్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తీవ్రంగా ఖండించింది.
“అధికార గర్వంతో కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలపై దాడులకు దిగుతూ తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే దాడి చేస్తారా?” అంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార అండతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చేస్తున్న అవినీతి, అక్రమాలను ఎమ్మెల్యే విజయుడు బయటపెట్టినందుకే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని ఎండగడితే సమాధానం చెప్పలేక దాడులకు దిగడమేనా మీ ‘ప్రజాపాలన’ అని ప్రశ్నించారు. అక్రమాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని నిలదీశారు.
ఎమ్మెల్యే విజయుడిపై దాడి చేసిన ఎంపీ మల్లు రవిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అధికార మదంతో దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చ కొనసాగుతోంది.








