ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలకు, ఐక్య పోరాటాలకు ఎంతో శక్తి ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు, నిరసనల ముందు ఎంతటి శక్తివంతమైన ప్రభుత్వాలైనా దిగిరావాల్సిందేనని భారతదేశ చరిత్ర మళ్లీ మళ్లీ నిరూపిస్తోంది. తాజాగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో ‘జెన్-జీ’ (Gen-Z) యువత జరిపిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు.
‘నీట్’ ప్రవేశ పరీక్షల లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగిన ఈ ఉద్యమం దాటికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజకీయ చరిత్రలో ప్రజా ఉద్యమాల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్న లేదా దిగివచ్చిన కొన్ని చారిత్రాత్మక ఘట్టాలు ఇవే..
- జన్ లోక్‌పాల్ ఉద్యమం (2011)
దేశంలో అవినీతి నిర్మూలనకు పటిష్టమైన చట్టం ఉండాలంటూ 2011లో ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే చేపట్టిన ఉద్యమం దేశాన్ని ఊపేసింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో అన్నా హజారే 13 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన తీవ్రమైన వ్యతిరేకతకు తలొగ్గి, లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి అంగీకరించింది.
2. నిర్భయ ఉద్యమం (2012)
2012 డిసెంబర్ 15న ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ సామూహిక అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా కల్లోలాన్ని సృష్టించింది. వేలాది మంది విద్యార్థులు, పౌరులు ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్ ముట్టడికి దిగారు. పెల్లుబికిన నిరసనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, వర్మ కమిటీని నియమించింది. దాని ఆధారంగా మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలు రూపొందిస్తూ “నిర్భయ చట్టం”ను తీసుకొచ్చింది.
3. చారిత్రాత్మక రైతు ఉద్యమం (2020-21)
స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగిన ఉద్యమాల్లో 2020 నాటి రైతు ఆందోళనలు ఒకటి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు సరిహద్దుల్లో దాదాపు ఏడాదికి పైగా శీతాకాలం, ఎండ, వర్షాలను తట్టుకుని పోరాటం చేశారు. రైతుల పట్టుదల, ఐక్యత ముందు కేంద్రం లొంగిపోక తప్పలేదు. 2021 నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
4. ‘జెన్-జీ’ విప్లవం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా (2026)
నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నపత్రం లీకేజీ, విద్యా వ్యవస్థలో అక్రమాలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో యువత చేపట్టిన పోరాటం సరికొత్త చరిత్రను తిరగరాసింది. పారదర్శకత, జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా యువత రోజుల తరబడి పోరాడింది. దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమానికి, యువత ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ (జూలై 25న) తన పదవికి రాజీనామా సమర్పించారు.
అధికారంలో ఎవరు ఉన్నా… రాజ్యాంగం అందించిన నిరసన తెలిపే హక్కుతో ప్రజలు సమైక్యంగా పోరాడితే, ఎలాంటి ప్రభుత్వమైనా తలవంచక తప్పదని ఈ చారిత్రక పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.







