దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ ప్రజా ఉద్యమంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతా దళాలు ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఆంక్షలు విధించాయి. ప్రధానంగా రాజధానిలోని 11 కీలక మెట్రో స్టేషన్లను మూసివేయడంతో పాటు, అల్లర్లు వ్యాపించకుండా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకు డిమాండ్
ఎన్నికల నిర్వహణ విధానంలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఆందోళన బాట పట్టింది. భారత సీనియర్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పోయిందని, ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఈసీఐ చీఫ్ వైదొలగాల్సిందేనని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.
జంతర్ మంతర్ వద్ద కట్టుదిట్టమైన బ్యారికేడ్లు
సిజేపి ఆందోళనకారులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వైపు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జంతర్ మంతర్‌కు దారితీసే అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసులు ముళ్లకంచెలు, భారీ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను దిగ్బంధించారు. జంతర్ మంతర్ పరిసరాల్లో ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.
ముంబైలో సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే అరెస్ట్
ఇటు ఢిల్లీలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే, అటు మహారాష్ట్ర రాజధాని ముంబైలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధినేత అభిజిత్ దీప్కేను ముంబై పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌తో సీజేపీ శ్రేణులు మరింత ఆగ్రహానికి గురయ్యాయి. తమ అధినేతను తక్షణమే విడుదల చేయాలని, శాంతియుతంగా నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పార్టీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
దేశ రాజధానిలో మెట్రో స్టేషన్లు మూతపడటం, ఇంటర్నెట్ నిలిపివేతతో సాధారణ ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.








