అధికార మదంతో కూటమి నేతలు తప్పుల మీద తప్పులు చేస్తూనే..నెపం మాత్రం పక్క పార్టీలపై నెట్టుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతల (Alliance Leaders) అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. తిరుపతి (Tirupati)లో ఒక గిరిజన యువకుడి పైన టీడీపీ (TDP), జనసేన (Janasena) నాయకుడు దినేష్ అలియాస్ సెటిల్‌మెంట్ దినేష్ విచక్షణ రహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా దాడి చేసిన ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను అధికార తెలుగు దేశం పార్టీ తన అఫిషియల్ అకౌంట్‌లో పోస్టు చేస్తూ నెపాన్ని ప్రతిపక్ష పార్టీపై దుష్ప్రచారానికి తెర తీసింది.
తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి అనుచరుల దౌర్జన్యం ఇది అంటూ టీడీపీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాడి చేసిన దినేష్ ఏకంగా జనసేన, టీడీపీ కండువాలు కప్పుకొని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం, విజయోత్సవ ర్యాలీలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలను వైసీపీ సోషల్ మీడియా బయటపెట్టడంతో కూటమి నేతలు మిన్నకుండిపోయారు. అవ్వా..ఎంత ఘోరం తప్పు చేసింది కాక, తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ ప్రతిపక్ష పార్టీ మండిపడుతోంది. ఇదే కాదు ఇలాంటి మరెన్నో ఘోరాలను అధికార పార్టీ నేతలు చేస్తూ..వైసీపీపై దుష్ప్రచారం చేయడం వారికి అలవాటుగా మారిందని విపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు.
ఇక్కడ బాధితుడు ఒక గిరిజన యువకుడు శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఓ దుకాణం ఉంది. దాని కాంట్రాక్ట్ తనకు రాసివ్వాలని అనిల్ రెడ్డి అడిగాడు. యువకుడు కుదరదన్నాడు. అంతే ఆ యువకుడిని కిడ్నాప్ చేసి ఎం.ఆర్.పల్లిలోని అనిల్ రెడ్డి ఇంట్లో బంధించిన దినేష్‌రెడ్డి అతనిని స్పృహ కోల్పోయేలా కొట్టారు. పైగా ఆ కిరాతకాన్ని వీడియో తీసి అందరికీ చూపించి భయపెడుతున్నారు. సెటిల్ మెంట్లలో మాకు అడ్డు చెబితే ఎవరికైనా ఇదే గతి అని హెచ్చరిస్తున్నారు. ఈ వీడియోలు చూసిన తిరుపతి ప్రజలు దినేష్‌ను గుర్తు పట్టి, అతని ఆగడాలను ఎండగడుతున్నారు. దినేష్ తరచు టీడీపీ , జనసేన జండాలు పట్టుకొని ప్రతి ర్యాలీ లో పాల్గొన్నాడు. తాము చేసిన దాడిని కప్పిపుచ్చడానికి వైసీపీ పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.








