ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ రంగంతో పాటు, ఏపీ రాజకీయాల్లో వివాదాస్పదంగా మారాయి. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తీరు, ఉపయోగించిన భాషపై ప్రతిపక్ష వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, తనపై బాలయ్య చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గట్టి కౌంటర్ ఇచ్చారు. తనను గత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారని, లంచ్ చేస్తూ ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, సినీ పరిశ్రమ ప్రయోజనాల కోసం మాత్రమే గత వైసీపీ ప్రభుత్వాన్ని కలిసినట్లు స్పష్టం చేశారు.
“నాపై బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటాన్ని టీవీలో చూశాను” అని మొదలుపెట్టిన చిరంజీవి, అప్పట్లో సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది నాయకులు, టికెట్ ధరల అంశంపై జగన్ సర్కార్‌తో సంప్రదింపులు జరపాలని కోరినట్లు తెలిపారు. అందుకే చొరవ తీసుకుని, అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో మాట్లాడి, ఆయన ఆహ్వానంతో అప్పటి సీఎం జగన్‌ను కలిసినట్లు వివరించారు.
ఆ సమయంలో సీఎం వైఎస్ జగన్ తనను సాదరంగా ఆహ్వానించి, లంచ్ చేస్తూ సినిమా పరిశ్రమ ఇబ్బందులపై చర్చించామని చెప్పారు. పరిశ్రమ-ప్రభుత్వాల మధ్య గ్యాప్ లేకుండా అందరం కలిసి రావాలని జగన్ సూచించడంతో, గత ప్రభుత్వం మీటింగ్‌కు డేట్ కూడా ఫిక్స్ చేసిందని చిరంజీవి వెల్లడించారు.
డేట్ ఫిక్స్ అయిన తర్వాత బాలకృష్ణను సంప్రదించడానికి ప్రయత్నించినా, ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు. “మూడు సార్లు ప్రయత్నించాను, జెమినీ కిరణ్ ద్వారా కూడా చెప్పించాను, అయినా బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు” అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తన పేరు ప్రస్తావనకు రావడంతోనే ఈ వివరణ ఇస్తున్నానని, సినీ పరిశ్రమ కోసం తాను చేసిన ప్రయత్నాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని చిరంజీవి అన్నారు.








