ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వంపై తాగునీటి సమస్యల విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఎకనామిక్స్ టైమ్స్ అనే పత్రిక చంద్రబాబుకు ‘వాటర్‌మ్యాన్’ అనే బిరుదు ఇస్తూ ఆర్టికల్ రాయడం, ఆ తర్వాత కేబినెట్‌లోనూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనకు మంత్రులు, అధికారులు గౌరవం ఇచ్చారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం తాగునీటి కోసం ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి రావడం చర్చకు దారితీస్తోంది. చంద్రబాబు బిరుదుకు కొత్త చిక్కొచ్చి పడింది.
వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడటం సాధారణంగా కనిపించే విషయం. నీటి కోసం ప్రజలు ఆందోళనలు చేయడం కూడా చూస్తుంటాం. కానీ వర్షాకాలంలోనూ తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కడం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. వర్షాకాలంలో ఏంటీ కష్టాలు అని ప్రజలు ప్రశ్నిస్తుండగా, ఇంత కరువులో చంద్రబాబుకు వాటర్ మ్యాన్ అని బిరుదు ఇచ్చిందెవరు..? అని సెటైర్లు వేస్తున్నారు.
విశాఖపట్నం శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజువాక, ఎండాడ, మధురవాడ, పెందుర్తి, భీమిలి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా తగ్గడం, ట్యాంకర్ల ద్వారా కూడా తగినంత నీరు అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎంవీవీ సిటీ, ఎండాడ పరిసర ప్రాంతాల్లో నీటి సమస్యపై మహిళలు రాత్రివేళ కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే.
అనంతపురం జిల్లాలోనూ తాగునీటి సమస్యపై నిరసన వ్యక్తమైంది. గుడిబండ మండలంలో మహిళలు ఖాళీ బిందెలతో నాగేపల్లి–కరికెర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతపురం ప్రాంతం తరచూ కరువు, నీటి కొరత సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కడం స్థానికంగా చర్చకు దారితీసింది. తాగునీటి సమస్యతో పాటు వ్యవసాయ రంగంపైనా నీటి కొరత ప్రభావం చూపుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోనూ
కడప, కర్నూలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్యలపై ప్రజలు ఆందోళనలకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖాళీ బిందెలతో నిరసనలు చేస్తూ తమ ప్రాంతాల్లో నీటి సరఫరాను మెరుగుపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో నీటి లభ్యత, రిజర్వాయర్లలో నిల్వలు, వర్షపాతం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు, వర్షపాతం లోటు, నీటి వనరుల నిర్వహణ వంటి అనేక అంశాలు తాగునీటి లభ్యతపై ప్రభావం చూపుతాయి.
‘వాటర్‌మ్యాన్’ బిరుదు.. ప్రజలకు నీళ్లు ఎప్పుడు?
చంద్రబాబుకు ‘వాటర్‌మ్యాన్’ అనే బిరుదు రావడం ఒకవైపు రాజకీయ ప్రచారానికి అంశంగా మారితే.. మరోవైపు అదే సమయంలో వర్షాకాలంలో తాగునీటి కోసం ప్రజలు ఆందోళనలకు దిగుతున్న దృశ్యాలు ప్రభుత్వానికి ఇరకాటంలో పడేశాయి. ‘నీటి నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామంటున్న చంద్రబాబు ప్రభుత్వం.. కనీసం తాగునీటి కోసం ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి రాకుండా చూడలేదా?’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వేసవి కాకపోయినా తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడటం మాత్రం పాలనకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్నగా నిలుస్తోంది. ‘వాటర్‌మ్యాన్’గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి.. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చేయడం ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది.








