డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు, శాప్ (SAP) కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులపై దాడి ఘటనలు తీవ్ర వివాదాస్పదంగా మారిన తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాలపై మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడతానని కేబినెట్ భేటీ అనంతరం ప్రకటించారు. ఈ విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్టులు హడావుడి చేసినప్పటికీ, ఆచరణలోకి వచ్చేసరికి చడీచప్పుడు లేకుండా సైలెంట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డీఎస్సీ అవకతవకలు, వైసీపీ శ్రేణులపై దాడి, కేసులు, అరెస్టులపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారనే అంశం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గంలోని సహచరులు డీఎస్సీ వివాదాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు, తానే నేరుగా రంగంలోకి దిగుతానని ప్రచారం చేయించుకున్నారు.
తీరా చూస్తే.. సీఎం మీడియా ముందుకు రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. డీఎస్సీ నియామకాల అక్రమాలపై, వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులపై మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే రద్దు చేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయినా, సెలెక్టెడ్ మీడియాతోనే చంద్రబాబు మాట్లాడుతారన్న వాదనా ఉంది.
ఒకప్పుడు చిన్నపాటి వర్షం వచ్చినా, తుఫాను అని వినపడగానే ఆర్టీజీఎస్ (RTGS) కార్యాలయంలో కూర్చుని అధికారులతో సమీక్షలు జరుపుతున్నట్లు హెడ్ లైన్స్ వేయించుకునే చంద్రబాబు.. ప్రస్తుతం ఉత్తరాంధ్రను తీవ్ర వాయుగుండం అతలాకుతలం చేస్తున్నా కనీసం సమీక్షల వార్తల్లో కూడా కనిపించకపోవడం గమనార్హం. డీఎస్సీ వ్యవహారంలో తలెత్తిన ప్రజా నిరసనల తుఫాన్లో ప్రభుత్వం చిక్కుకోవడంతో నిజమైన తుఫాన్‌ను పట్టించుకోవడం లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా?
ముఖ్యమంత్రి స్థాయిలో ఒక అంశంపై స్పందిస్తానని ప్రచారం చేయించుకుని, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం ఆయన ప్రచార ఆర్భాటాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు ఉన్న తేడాను ఎండగడుతోంది. ప్రభుత్వం చేసిన తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ఈ రకమైన పలాయనవాదాన్ని ఎంచుకున్నారని, నిరుద్యోగులు, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఇప్పటికైనా ముఖ్యమంత్రి ముక్కుసూటిగా సమాధానం చెప్పాల్సి ఉందనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.








