ఏషియన్ గేమ్స్ 2026లో పురుషుల క్రికెట్ పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా సెప్టెంబర్ 28న ఉదయం 10 గంటలకు నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-Aలో రెండో స్థానంలో నిలిచే ఆఫ్ఘనిస్థాన్, జపాన్, నేపాల్‌లోని ఒక జట్టు భారత్‌కు ప్రత్యర్థిగా నిలవనుంది.
భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు కూడా నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్తులు దక్కాయి. గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్థాన్, జపాన్, నేపాల్ గ్రూప్-Aలో.. హాంకాంగ్, మలేషియా, ఒమన్ గ్రూప్-Bలో తలపడనున్నాయి. సెప్టెంబర్ 28న భారత్ క్వార్టర్‌ఫైనల్ ఆడనుండగా.. సెప్టెంబర్ 29న మిగిలిన రెండు క్వార్టర్‌ఫైనల్స్, అక్టోబర్ 1న సెమీఫైనల్స్, అక్టోబర్ 3న పతక పోటీలు జరగనున్నాయి. హాంగ్జౌలో స్వర్ణం సాధించిన భారత్.. ఐచి-నగోయాలోనూ అదే జోరును కొనసాగించి మరోసారి బంగారు పతకం సాధించడంపై దృష్టి పెట్టింది.








