“చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి మాత్రం దుబారా పనులు” అన్న చందంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల తీరు. ఒకవైపు ప్రభుత్వంలో పొదుపు చర్యలు పాటించాలంటూ క్యాబినెట్ భేటీలో భారీ డైలాగులు చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గంటల వ్యవధిలోనే ఆ నిబంధనలను గాలికొదిలేశారంటూ ఏపీ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో విహరించడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేబినెట్ ముగిసిన క్షణాల్లోనే..
గురువారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానమంత్రి సూచించిన పొదుపు మంత్రంపై పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు సీఎం చంద్రబాబు. అంతేకాదు, పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు కోసం శుక్రవారం రోజును ‘నో వెహికల్ డే’ (No Vehicle Day) గా పాటిస్తామని ప్రకటించారు. కానీ ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే.. మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్‌లో పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడ నుంచి ధర్మవరానికి భారీ కాన్వాయ్‌తో వెళ్లారు.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం శుక్రవారం పుట్టపర్తి పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో ల్యాండ్ అవ్వడం విశేషం. తాము స్వయంగా ఆచరించి ప్రజలకు మార్గదర్శకంగా నిలవాల్సిన పాలకులే.. ‘నో వెహికల్ డే’ నాడే ప్రత్యేక విమానాలు, భారీ కాన్వాయ్‌లతో తిరగడంపై రాజకీయ పండితులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

పుట్టపర్తి సభకు ప్రజాధనం వృథా!
చంద్రబాబు పుట్టపర్తి పర్యటన సందర్భంగా భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సభకు జన సమీకరణ కోసం వందలాది ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. అంతేకాకుండా స్కూల్ బస్సులను కూడా జనాలను తరలించడానికి వినియోగించడంతో సీఎం సభకు జనసమీకరణకు ఎంత డబ్బు ఖర్చు చేశారని నిలదీస్తున్నారు. బహిరంగ సభల పేరుతో ఈ స్థాయి దుబారా అవసరమా అని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రధాని పేరు వాడుకుంటూ..
“నా దేశం – నా బాధ్యత” అంటూ దేశభక్తి, పొదుపు మంత్రం పఠించే సీఎం చంద్రబాబు..మరి ప్రధాని నుంచి నేర్చుకున్న పొదుపు చర్యలు ఇవేనా? అంటూ ప్రతిపక్షాలు, ప్రజలు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం జనం సొమ్ముతో జల్సాలు చేస్తూ, పొదుపు ప్రవచనాలు కేవలం సామాన్యులకే పరిమితం చేస్తున్నారనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు, లోకేష్‌లా దుబారా ఖర్చులపై సోషల్ మీడియాలోనూ నెటిజన్లు గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు.








