నడకపై పన్ను.. ఇదేం విచిత్రం బాబూ!

నడకపై పన్ను.. ఇదేం విచిత్రం బాబూ!

ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఆ ఆరోగ్యం కోసం కాస్త నడక సాగిద్దామన్నా ఇప్పుడు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. విశాఖపట్నంలోని ప్రధాన స్టేడియాల్లో వాకింగ్ చేసే వారిపై ‘యూజర్ చార్జీల’ పేరుతో పన్ను వసూలు చేయాలనే జీవీఎంసీ (GVMC) ప్రతిపాదన ఇప్పుడు ఆ నగరవాసుల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

ఏమిటా ప్రతిపాదన?
విశాఖలో జీవీఎంసీ ప‌రిధిలోని ఇందిరా ప్రియదర్శిని, స్వర్ణభారతి వంటి ప్రధాన స్టేడియాల్లో నిర్వహణ పేరుతో చార్జీలు వసూలు చేయాలని అధికారులు ప్ర‌తిపాద‌న సిద్ధం చేసిన‌ట్టుగా సమాచారం. అధికారుల ప్రతిపాదన మేరకు ఆయా స్టేడియాల్లో ఇన్నాళ్లూ ఉచితంగా వాకింగ్ చేసుకున్న వాకర్స్ ఇక‌ నుంచి నెలకు సుమారు రూ.720 వరకు చార్జీలు వ‌సూలు చేసే అవకాశం ఉంది. నడకకు కూడా పన్ను విధానంపై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక వ్య‌క్తం అవుతోంది.

మున్ముందు గాలికి కూడా సెస్ వేస్తారా?
సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న మున్సిపల్ కార్పొరేషన్, వేల కోట్ల బడ్జెట్ ఉండి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై జనం మండిపడుతున్నారు. “గతంలో చెత్త వాహ‌నాల నిర్వ‌హ‌ణ కోసం పన్ను వేస్తేనే నాటి ముఖ్య‌మంత్రిని నోటికి వ‌చ్చిన‌ట్టుగా తూల‌నాడిన నాయకులు, వారు అధికారంలోకి వ‌చ్చాక ఏకంగా నడకపై పన్ను వేయడం ఏంటని?” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు, టోల్ చార్జీలు, సినిమా టికెట్ల ధ‌ర‌లు, మద్యం ధరల పెంపుతో సతమతమవుతున్న సామాన్యుడికి ఇది గొడ్డలి పెట్టు వంటిదని విమర్శలు వస్తున్నాయి. మున్ముందు పీల్చే గాలిపై కూడా సెస్ వేస్తారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

రంగంలోకి వామపక్షాలు
ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ సిపిఎం (CPM) నేతలు స్వర్ణభారతి స్టేడియం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ఈ ‘నడక పన్ను’ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, నేడు అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించడం “తుగ్లక్ పాలన”ను తలపిస్తోందని విమర్శించారు. క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది పోయి, వారిపై ఇలాంటి భారాలు మోపడం వల్ల క్రీడా రంగం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే ప్ర‌జ‌ల నుంచి ప‌న్నులు వ‌సూలు చేయ‌డం కాద‌ని, ప్రజా సంక్షేమాన్ని కూడా చూడాలని విశాఖ వాసులు కోరుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఈ తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ప్రభుత్వం ఈ యూజర్ చార్జీల ప్రతిపాదనపై వెనక్కి తగ్గుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment