ప్రీ-వెడ్డింగ్ షూట్‌.. ప్రియుడితో క‌లిసి కాబోయే భర్త హ‌త్య‌

ప్రీ-వెడ్డింగ్ షూట్‌.. ప్రియుడితో క‌లిసి కాబోయే భర్త హ‌త్య‌

పుణెలో కలకలం రేపిన వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ (26) మృతి కేసులో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత లోహగడ్ కోటపై ప్రీ-వెడ్డింగ్ ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తు 400 అడుగుల లోయలో పడిపోయాడని అందరూ భావించారు. కానీ, పోలీసుల దర్యాప్తులో అది ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ‘హత్య’ అని తేలింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించి, ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

రూ. 17 కోట్లతో జైపూర్‌లో పెళ్లి ఏర్పాట్లు..
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కేతన్ అగర్వాల్ కుటుంబం, ఈ ఏడాది నవంబర్‌లో జైపూర్‌లోని ఒక లగ్జరీ వెన్యూలో అత్యంత వైభవంగా వివాహం జరిపించేందుకు ఏకంగా రూ. 17 కోట్లు వెచ్చించి బుకింగ్స్ కూడా పూర్తి చేసింది. అయితే, సియా గోయల్‌కు అప్పటికే చేతన్ చౌదరి అనే యువకుడితో రహస్య ప్రేమాయణం ఉంది. పెళ్లి ఇష్టం లేని సియా, కేతన్‌ను వదిలించుకోవాలని తన ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.

పోలీసుల విచారణలో షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. నిజానికి వీరిద్దరూ ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం మొదట అంతర్జాతీయ పర్యాటక ప్రాంతమైన ‘బాలి’ వెళ్లాల్సి ఉంది. కానీ కేతన్ అక్కడైతే ప్రమాదం చేయడం కష్టమని భావించిన సియా, ముందే ప్లాన్ చేసి ముంబై ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో కేతన్ పాస్‌పోర్ట్‌ను దొంగిలించింది. దీంతో బాలి ట్రిప్ క్యాన్సిల్ అయింది.

బాలి ట్రిప్ రద్దు కావడంతో, సియా తన పుట్టినరోజు నెపంతో కేతన్‌ను పుణె సమీపంలోని లోహగడ్ కోటకు ట్రెకింగ్, ఫొటోల కోసం రమ్మని బలవంతం చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం సియా ప్రియుడు చేతన్ చౌదరి కూడా అదే సమయానికి లోహగడ్ కోటకు చేరుకున్నాడు. తీవ్రమైన ఎండలో అతను ముఖానికి మాస్క్, తలపై హుడీ, కళ్ళకు గ్లాసెస్, చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని తిరిగాడు. సిసిటివి కెమెరాల్లో ఈ దృశ్యం పోలీసులకు అనుమానం కలిగించింది.

కోటపై రక్షణ గోడలు లేని ఒక ప్రమాదకరమైన మలుపు వద్దకు కేతన్‌ను సియా తీసుకెళ్లింది. అక్కడ సియా సిగ్నల్ ఇవ్వగానే, వెనుక నుంచి వచ్చిన చేతన్ చౌదరి కేతన్‌ను గట్టిగా 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసాడు. పెళ్లి ఖాయమైనప్పటి నుంచి సియా కేతన్‌తో కంటే తన ప్రియుడు చేతన్‌తోనే దాదాపు 2000 కంటే ఎక్కువ సార్లు, 238 గంటల పాటు ఫోన్ మాట్లాడినట్లు పోలీసుల కాల్ డేటా రికార్డుల్లో తేలింది. అలాగే ఘటన జరిగిన రోజు కూడా వీరిద్దరూ నిరంతరం టచ్‌లో ఉన్నారు.

కుటుంబ సభ్యుల ఆవేదన
కేతన్ మృతదేహం లభ్యమైన సమయంలో సియా ప్రవర్తనలో ఎలాంటి బాధ, కన్నీళ్లు లేకపోవడంతో కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్‌కు మొదట్లోనే అనుమానం వచ్చింది. కోట చుట్టూ రక్షణ కంచెలు ఉన్నప్పటికీ తన కుమారుడు ఎలా పడిపోతాడని ఆయన ప్రశ్నించడంతో పోలీసులు గాలించి నిజాలు బయటపెట్టారు. కోట్లాది రూపాయల ఖర్చుతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు, నమ్మిన యువతి చేతిలోనే దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ప్రస్తుతం నిందితులిద్దరిపై హత్య, క్రిమినల్ గూడుపుఠాణీ కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment