సీఐ అరెస్టు వెనుక ‘పెద్ద ఆఫ‌ర్‌’.. నిజమేనా?

సీఐ అరెస్టు వెనుక ‘పెద్ద ఆఫ‌ర్‌’.. ఆ చర్చ నిజమేనా?

కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాక‌ప్‌డెత్ ఆరోప‌ణ‌ల ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వేళ.. ఈ కేసులో తాజాగా అరెస్ట్ అయిన సీఐ నాగరాజు వ్యవహారం చుట్టూ ఇటు రాజకీయ వర్గాల్లో, అటు పోలీసు శాఖలో పలు ఆసక్తికరమైన కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. సీఐ నాగరాజు అరెస్టుకు ముందు తెరవెనుక పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణాలు, రాయబారాలు సాగాయనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

మొదట ఈ కేసులో తనపైనే పూర్తి బాధ్యత నెట్టేసే ప్రయత్నం జరుగుతోందనే అసంతృప్తితో సీఐ నాగరాజు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం సాగింది. టాస్క్‌ఫోర్స్ విభాగం అదుపులోకి తీసుకున్న వ్యవహారాన్ని తన ఖాతాలో ఎలా వేస్తారంటూ ఆయన సన్నిహిత వర్గాల వద్ద ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే, మంగళవారం ఆయన హఠాత్తుగా పోలీసుల ఎదుట ప్రత్యక్షం కావడం, అరెస్టుకు సహకరించడం వెనుక ఒక పెద్ద ‘ఆఫర్’ నడిచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

పోలీసు సర్కిల్స్‌లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం
వచ్చే ఎన్నికల్లో సీఐ నాగరాజుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు ఒక కీలక పార్టీతో పాటు దాని మిత్రపక్షం కూడా సానుకూలంగా ఉందనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఎన్నికల వ్యయాన్ని సైతం ఒక ప్రధాన అధికార పార్టీ నేతలే చూసుకుంటారనే భరోసా లభించిందన్న‌ గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అరెస్ట్ అయినప్పటికీ, త్వరలోనే బెయిల్ వచ్చేలా చూసి, కేసును చట్టపరంగా లూప్‌హోల్స్‌తో నీరుగార్చేందుకు తెరవెనుక పూర్తి హామీ లభించిందనేది ఈ ప్రచారం సారాంశం.

రిటైర్డ్ డీజీపీ రాయబారం నడిపారా?
ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. అజ్ఞాతంలో ఉన్న సీఐ నాగరాజును ఒప్పించడానికి ఒక రిటైర్డ్ డీజీపీ రంగంలోకి దిగినట్లు సమాచారం. గతంలో కీలక బాధ్యతలు నిర్వహించిన సదరు ఉన్నతాధికారికి సీఐ నాగరాజుతో ఉన్న పాత పరిచయాలు, బంధుత్వాల నేపథ్యంలోనే ఈ సంప్రదింపుల బాధ్యతను పెద్దలు ఆయనకు అప్పగించారని టాక్.

ఈ వ్యవహారానికి మూల కారణమైన భూ, ఆర్థిక లావాదేవీల అంశాలను గానీ, ఇందులో ఉన్నతాధికారులు (బాస్, బిగ్‌బాస్), అధికార పార్టీకి చెందిన కీలక నేతల పేర్లను గానీ ఎక్కడా బయటపెట్టకూడదనే ఏకైక షరతుతోనే ఈ ‘ప్యాకేజీ’ కుదిరినట్లు అంతర్గత వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

మరోవైపు, సీఐ నాగరాజుకు స్థానికంగా. సామాజిక వర్గాల పరంగా ఉన్న పట్టును ఉపయోగించుకుని, ఈ వ్యవహారానికి ప్రజా మద్దతు ఉందనే రంగు పులిమేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొందరు స్థానిక శ్రేణులు ఆందోళనల బాట పట్టారనే విమర్శలు కూడా వస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ సాయికృష్ణ కేసులో.. ఇప్పుడు పెద్ద పెద్ద పోలీస్ బాస్‌లు, రాజకీయ పెద్దలు, రాబోయే ఎన్నికల సీట్ల సర్దుబాట్ల చర్చల వరకు వెళ్లడం చూస్తుంటే, ఈ కేసు ముందు ముందు మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment