బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. తదుపరి విచారణ నిమిత్తం వారిని ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. నలుగురు అగ్నివీర్ గార్డులు అందించిన కీలక సమాచారంతో సుమారు పది రోజుల తర్వాత ఆయుధాల చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. శిక్షణ కోసం వినియోగించే ఆయుధాలకు సాధారణంగా ప్రత్యేక కోడింగ్ నంబర్లు ఉండవని గుర్తించిన నిందితులు, పక్కా ప్రణాళికతో సుమారు మూడు నెలల పాటు విడతల వారీగా ఆయుధాలను మాయం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. వర్షం కురిసిన ఓ రాత్రి ఆయుధాగారం తాళాలు పగలగొట్టి, బయటి వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే రాత్రివేళల్లో సీసీ కెమెరాలను నిలిపివేయడం, విధుల్లో ఉన్న గార్డులను ఇతర పనులకు పంపించడం వంటి చర్యల ద్వారా ఆయుధాలను బయటకు తరలించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనలో 12 అత్యాధునిక ఆయుధాలతో పాటు సుమారు 2 వేల రౌండ్ల బుల్లెట్లు మాయమైనట్లు సమాచారం. ఇంత భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఎలా బయటకు తరలించబడ్డాయి? వాటిని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎవరి కోసం ఈ చోరీకి పాల్పడ్డారు? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. కేసు తీవ్రత దృష్ట్యా డిఫెన్స్ ఇంటెలిజెన్స్, మిలిటరీ పోలీస్ అధికారులు దర్యాప్తులో భాగస్వాములయ్యారు. అరెస్టయిన అధికారుల కాల్ డేటా, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయుధాలు ఎవరికి చేరాయి, ఈ వ్యవహారంలో ఉగ్రవాద సంస్థలు లేదా ఇతర నేర శక్తుల ప్రమేయం ఉందా అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది. మూడు నెలలుగా సాగినట్లు అనుమానిస్తున్న ఈ ఆయుధాల మాయం వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముగ్గురు సీనియర్ అధికారుల అరెస్ట్‌తో కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.








