కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరధ్‌పై తీవ్రస్థాయిలో నేరారోపణలు వెల్లువెత్తాయి. ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.
బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పలు సంచలన విషయాలను పేర్కొన్నారు. తమ మైనర్ కూతురికి మద్యం తాగించి సాయి భగీరధ్ అత్యాచారానికి పాల్పడ్డాడని వారు ఆరోపించారు. మొయినాబాద్ ప్రాంతంలోని ఒక ఫార్మ్ హౌజ్‌తో పాటు మరో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ దారుణం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బండి సాయి భగీరధ్ వేధింపులు తాళలేక తమ కూతురు గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కూతురిపై జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, బాధితురాలిపైనే సాయి భగీరధ్ ఎదురుగా తప్పుడు కేసులు పెడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు బండి సాయి భగీరధ్‌పై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై బండి సంజయ్ వర్గీయులు స్పందిస్తూ.. ఇదంతా ఒక ‘హనీ ట్రాప్’ అని ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి కుమారుడిపై ఇలాంటి గంభీరమైన కేసు నమోదు కావడంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసులు ఈ ఘటనపై లోతైన విచారణ జరుపుతున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.








