ఆస్ట్రేలియా, బ్రెజిల్ మధ్య బ్రిస్బేన్‌లోని సన్‌కార్ప్ స్టేడియంలో జరుగుతున్న అంతర్జాతీయ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. మ్యాచ్ ఆరంభమైన మూడో నిమిషంలోనే బ్రెజిల్ తరఫున వాండర్సన్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. అయితే 28వ నిమిషంలో అలెస్సాండ్రో సిర్కాటి గోల్‌తో ఆస్ట్రేలియా స్కోరును సమం చేసింది.
ఆ తర్వాత ఆతిథ్య ఆస్ట్రేలియా మరింత దూకుడుగా ఆడింది. 34వ నిమిషంలో కానర్ మెట్కాఫ్ గోల్ చేయడంతో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే తొలి అర్ధభాగం ముగిసే ముందు బ్రెజిల్ తిరిగి పుంజుకుంది. అదనపు సమయంలో లభించిన పెనాల్టీని రఫిన్హా గోల్‌గా మలిచి స్కోరును 2-2తో సమం చేశాడు. దీంతో ఉత్కంఠ మధ్య తొలి 45 నిమిషాలు ముగిశాయి.
తొలి మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసిన నేపథ్యంలో ఈ రెండో పోరులో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాయి. బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలొట్టి తొలి మ్యాచ్‌తో పోలిస్తే తుది జట్టులో ఏడు మార్పులు చేయగా.. రఫిన్హాను ‘ఫాల్స్ నైన్’గా ఆడించాడు. మరోవైపు టోనీ పోపోవిచ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లోని జట్టునే కొనసాగించింది. రెండో అర్ధభాగంలో ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.








