‘సూపర్ స్టార్’ రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సీనియర్ నటి సిమ్రాన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోతో ఇప్పటివరకు వినిపించిన రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. ఈ సినిమాలో రామ్ ప్రతినాయక ఛాయలున్న విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఆయన పాత్ర పూర్తిస్థాయి విలన్‌గా కాకుండా కథలో కీలక మలుపులకు కారణమయ్యే విధంగా ఉంటుందని టాక్.
మరోవైపు రాశి ఖన్నా ఈ సినిమాలో రజినీకాంత్ కుమార్తెగా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెకు జోడీగా రామ్ నటించనున్నారని టాక్ వినిపిస్తుండటంతో రజినీకాంత్, రామ్, రాశి ఖన్నా కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలతో పాటు రజినీకాంత్ ఇమేజ్‌కు తగ్గ యాక్షన్, వినోద అంశాలను దర్శకుడు అశ్వత్ మారిముత్తు మేళవిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మైసూర్ పరిసరాల్లో షూటింగ్ కొనసాగుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ధర్మన్’ను సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.









‘SIR గో బ్యాక్’.. ఢిల్లీలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు