2026 ఆసియా గేమ్స్ కోసం జపాన్‌లోని నాగోయాకు చేరుకున్న భారత బృందానికి వసతి విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు చెక్‌ఇన్ సమయంలో ఒకే గది కేటాయించడం గందరగోళానికి దారితీసింది. మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయించడంపై వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) జోక్యంతో ప్రత్యామ్నాయ గది ఏర్పాటు చేసినప్పటికీ, ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది.
చివరకు అశోక్ మిశ్రాకు ప్రత్యేక గది కేటాయించినా.. హోటల్ రిజిస్టర్‌లో ఆయన పేరులో ‘I’ అక్షరం నమోదు కాకపోవడంతో బుకింగ్ గుర్తింపులో మరో సమస్య తలెత్తింది. దీంతో అదనంగా 45 నిమిషాల సమయం పట్టి, రాత్రి 2 గంటల తర్వాతే ఆయన గదికి చేరుకున్నారు.
ఈ ఘటనపై ప్రణతి నాయక్ స్పందిస్తూ.. వసతి విషయంలో గందరగోళం చోటుచేసుకున్నది నిజమేనని, సుమారు రాత్రి 2 గంటల సమయంలో సమస్య పరిష్కారమైందని తెలిపారు. భారత బృందం నాగోయాకు చేరుకున్నప్పటి నుంచి పలువురు అథ్లెట్లు గదుల కేటాయింపు, చెక్‌ఇన్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చినట్లు సమాచారం. శిక్షణ, పోషకాహార ఏర్పాట్ల విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది.
భారత కబడ్డీ బృందానికి కూడా ఇలాంటి సమస్యలు ఎదురైనట్లు సమాచారం. పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇకపై వసతి, సమన్వయానికి సంబంధించిన సమస్యలు లేకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని భారత అథ్లెట్లు, కోచ్‌లు ఆశిస్తున్నారు.








