APSRTC అల‌ర్ట్‌.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం

APSRTC అల‌ర్ట్‌.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం

Summarize with AI

ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ఉద్యోగుల్లో ఆందోళ‌న మొద‌లైంది. మొన్న ఆర్టీసీ చైర్మ‌న్ (RTC Chairman) ప్ర‌క‌ట‌న నుంచి ఉద్యోగుల్లో గుబులు మొద‌లైంది. ప్రైవేటీకరణ (Privatization) దిశ‌గా చంద్ర‌బాబు ప్రభుత్వం (Chandrababu Government) నిర్ణయాలు తీసుకుంటోంద‌ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆరు ఆర్టీసీ సంఘాలు జేఏసీగా (JAC) ఏర్ప‌డ్డాయి. ప‌లు డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ముందు ఉంచుతూ, ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు.

ఎలక్ట్రికల్ బస్సులను (Electrical Buses) ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ మొండివైఖరిపై సమర శంఖం పూరించేందుకు ఆరు ప్రధాన ఆర్టీసీ యూనియన్లు ఏకమై ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ (JAC)గా ఏర్పాటయ్యాయి. విజయవాడలో సమావేశమైన జేఏసీ నేతలు.. తమ డిమాండ్ల సాధనకై జూన్ నెలలో చేపట్టబోయే రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణను విడుదల చేశారు.

  • ఆర్టీసీ జేఏసీ డిమాండ్లు
  • ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులకు/ఆపరేటర్లకు అప్పగించే ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలి.
  • సంస్థ అస్తిత్వాన్ని కాపాడుతూ, ఆర్టీసీని పూర్తిస్థాయి ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి.
  • ఉద్యోగుల హక్కులను, ప్రయోజనాలను రక్షించాలి.

చంద్ర‌బాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జేఏసీ విడతల వారీగా నిరసన కార్యక్రమాలను రూపొందించింది. జూన్ 11న జేఏసీ ఆధ్వర్యంలో తమ డిమాండ్లు, భవిష్యత్ ఉద్యమ ప్రణాళికతో కూడిన వినతిపత్రాలను ఆర్టీసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (MD)తో పాటు ప్రభుత్వానికి అందజేస్తారు.

జూన్ 16 నుండి 20 వరకు ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు నాలుగు జోన్ల పరిధిలో ఐదు ప్రాంతాలలో ప్రత్యేక సన్నాహక సదస్సులు నిర్వహిస్తారు. జూన్ 16న‌ విజయనగరం, జూన్ 17న‌ విజయవాడ, జూన్ 18న‌ నెల్లూరు, జూన్ 19న‌ తిరుపతి (ఉమ్మడి చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలు), జూన్ 20న‌ అనంతపురం (ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలు), జూన్ 23, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ డిపోలు (RTC Depots), యూనిట్లలో ఉద్యోగులందరూ (Employees) ఎర్ర రిబ్బన్లు (Red Ribbons) ధరించి విధులకు హాజరవుతారు. అదేవిధంగా డిపోల వద్ద భారీ ధర్నాలు నిర్వహిస్తారు.

జూన్ 28న విజయవాడలో (Vijayawada) జేఏసీ మరోసారి కీలక సమావేశం కానుంది. ప్రభుత్వం స్పందించని పక్షంలో చేపట్టబోయే తీవ్రతరమైన భవిష్యత్ కార్యాచరణను (సమ్మె వంటి నిర్ణయాలను) ఈ సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తారు.

జేఏసీ నేతల హెచ్చరిక
“ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి లాభాపేక్ష వైపు తీసుకెళ్తే ఊరుకునేది లేదు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో జరుగుతున్న ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుంది” అని హెచ్చ‌రించారు. ఆర్టీసీ ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ పోరాటంలో పాల్గొనాలని, సంస్థను కాపాడుకోవాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. మరి ఈ ఉద్యమ పంథాపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment