ఎన్నికల సమయంలో మునగచెట్టు ఎక్కించి, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్నా.. తమను పట్టించుకోవడం లేదని.. చంద్రబాబు ప్రభుత్వంపై (Chandrababu Government) ఉద్యోగులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ అమరావతి (APJAC Amaravati) ఉద్యమ బాట పట్టింది. ఉద్యోగుల బకాయిలు(Employees’ Arrears), పీఆర్సీ(PRC), ఐఆర్(IR), డీఏ(DA) తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు దశల్లో ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఇందులో భాగంగా నేడు ఏపీసీఎస్కు ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేయనున్నట్లు ఏపీజేఏసీ అమరావతి నేతలు తెలిపారు.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 11 వరకు తొలి దశ ఉద్యమాన్ని నిర్వహించనున్నారు. ఆగస్టు 31న జిల్లా కలెక్టర్లకు పీజీఆర్ఎస్ ద్వారా వందలాది మంది ఉద్యోగులతో కలిసి ఉద్యమ కార్యాచరణ నోటీసులు అందజేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగులు తమ వాట్సాప్ డీపీగా ‘సీఎం సార్(CM Sir).. మా డబ్బులు మాకు ఇవ్వండి’ అనే సందేశంతో కూడిన ఫొటోలను పెట్టుకోనున్నారు.
సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు (Black Badges) ధరించి నిరసన తెలపనున్నారు. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు జిల్లాల్లోని అన్ని ఉద్యోగ సంఘాలకు కరపత్రాలు పంపిణీ చేసి ఉద్యమానికి ఆహ్వానించనున్నారు.
సెప్టెంబర్ 3, 5 తేదీల్లో ప్రతి కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయం వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 11న అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు(Round Table Meetings) నిర్వహించాలని ఏపీజేఏసీ అమరావతి నిర్ణయించింది.
సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు రెండో దశ ఉద్యమాన్ని చేపట్టనున్నారు. ఈ దశలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ‘వర్క్ టు రూల్’ ఉద్యమాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు ఉద్యోగుల బకాయిలు, పీఆర్సీ, ఐఆర్, డీఏ సమస్యలపై సోషల్ మీడియాలో డీపీలు, ఫొటోలు, రీల్స్ ద్వారా ప్రచారం నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 15 నుంచి 25 వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రాలు అందజేయనున్నారు. సెప్టెంబర్ 17న నల్ల కండువాలతో నిరసన చేపట్టి ‘సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి’ అనే నినాదంతో మానవహారం నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 23న కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 26న ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి ‘మా డబ్బులు మాకివ్వండి’ అనే నినాదంతో ధర్నాలు చేపట్టనున్నారు.
సెప్టెంబర్ 26 తర్వాత మూడో దశ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఏపీజేఏసీ అమరావతి నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు మల్టీ జోన్ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం సహాయ నిరాకరణ, రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ప్రతిపాదించారు.
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని ఏపీజేఏసీ అమరావతి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అవసరమైతే ‘ఛలో విజయవాడ’ కార్యక్రమంతో పాటు నిరవధిక సమ్మె వరకు ఉద్యమాన్ని తీసుకెళ్లాలని కార్యాచరణ రూపొందించింది. ఉద్యోగుల బకాయిలు, పీఆర్సీ, ఐఆర్, డీఏ తదితర సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కారం చూపాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.







