మ‌ళ్లీ తెర‌పైకి మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌.. రూ.1,630 కోట్ల వీజీఎఫ్‌పై ప్రశ్నలు!

మ‌ళ్లీ తెర‌పైకి మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌.. రూ.1,630 కోట్ల వీజీఎఫ్‌పై ప్రశ్నలు!

Summarize with AI

వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో ఏపీలో నిర్మించిన‌, నిర్మాణ ద‌శ‌లో ఉన్న ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేట్‌ప‌రం చేసే ప్ర‌తిపాద‌న‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ముందుకు తెస్తోంది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల‌ను ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్వహించాలన్న చంద్ర‌బాబు ప్రభుత్వ నిర్ణయంపై వివాదం కొనసాగుతోంది.

ప్ర‌భుత్వ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు ఎవ‌రైనా ముందుకువ‌స్తే కేసులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించ‌డం అంద‌రూ వెన‌క్కి త‌గ్గారు. రాయితీల పేరుతో మ‌రోసారి ఈ వివాదాన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తెర‌పైకి తీసుకువ‌చ్చింది. ఇప్పటికే ప్రైవేట్ సంస్థలకు పలు రాయితీలు కల్పించిన కూట‌మి ప్రభుత్వం, తాజాగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పేరుతో సుమారు రూ.1,630 కోట్ల ఆర్థిక సాయం వారికి అందించేందుకు సిద్ధమవుతోంది.

అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పాలకొల్లు, పెనుకొండ వైద్య కళాశాలలకు వీజీఎఫ్ కింద రూ.1,200 కోట్లకు పైగా కేటాయించే ప్రతిపాదనలు ఉన్నట్లు స‌మాచారం. అలాగే గతంలో టెండర్లకు స్పందన రాని ఆదోని, మదనపల్లె, మార్కాపురం కాలేజీలకు మరో రూ.430 కోట్లకుపైగా ఆర్థిక సాయం అందించి వాటిని ప్రైవేట్ ప‌రం చేయాల‌నే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది.

పీపీపీ విధానంలో ఒక్కో వైద్య కళాశాలకు సుమారు 50 ఎకరాల భూమిని ఎకరాకు ఏడాదికి రూ.100 లీజుతో కేటాయించడం, 66 ఏళ్ల నిర్వహణ హక్కులు కల్పించడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. బోధనాస్పత్రుల్లో 70 శాతం పడకలకు ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు సమకూర్చడం, మిగిలిన 30 శాతం పడకల్లో ఫీజులు వసూలు చేసుకునే అవకాశం కల్పించడం, సగం మెడికల్ సీట్లను యాజమాన్య కోటాలో భర్తీ చేసుకునే వెసులుబాటు ఇవ్వడంపైనా చర్చ జరుగుతోంది.

గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టగా, వాటిలో ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. మిగిలిన కళాశాలల నిర్మాణాలను ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేయవచ్చని, ప్రైవేట్ సంస్థలకు అదనపు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు పీపీపీ కళాశాలల్లో వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే వేతనాలు చెల్లించే ప్రతిపాదన ఉన్నట్లు స‌మాచారం. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉద్దేశించిన వీజీఎఫ్ నిధులను ఇప్పటికే ప్రభుత్వ భూములు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న వైద్య కళాశాలలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment