అమరావతిలో రూ.12 వేల కోట్ల భూ మినహాయింపుల మర్మమేంటి?

అమరావతిలో రూ.12 వేల కోట్ల భూ మినహాయింపుల మర్మమేంటి?

Summarize with AI

అమరావతి ప్రాంతంలో గ్రామకంఠం పేరుతో భూములకు ఇచ్చిన మినహాయింపులపై వివాదం నెలకొంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా భూసమీకరణ నుంచి మినహాయింపు వార్త‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఈ భూముల విలువ సుమారు రూ.12 వేల కోట్లు ఉంటుందని అంచనా. ముఖ్యంగా టీడీపీ నేతలు, ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన వ్యక్తులకు ప్రయోజనం చేకూరేలా మినహాయింపులు ఇచ్చారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

2014 డిసెంబర్ 8 నాటికి గ్రామాల్లో ఉన్న నివాస ప్రాంతాలు, అనుమతి పొందిన లేఅవుట్లలోని ప్లాట్లను మాత్రమే భూసమీకరణ నుంచి మినహాయించాలని 2015 మార్చి 1న సీఆర్‌డీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే వ్యవసాయ భూములను కూడా గ్రామకంఠంగా పరిగణించి మినహాయింపులు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొత్తం 6,473.72 ఎకరాలకు మినహాయింపులు ఇవ్వగా, అందులో సుమారు 3 వేల ఎకరాల కేటాయింపులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

వెలగపూడిలో సీఎం చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన నివాస ట్రస్టు పేరుతో 25 వేల చదరపు గజాల స్థలాన్ని రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసినట్లు, ఆ స్థ‌లాన్ని విక్రయించిన కంచర్ల సాంబశివరావు కుటుంబానికి చెందిన 1.76 ఎకరాలను గ్రామకంఠం కింద మినహాయించారని స‌మ‌చారం. అలాగే నారా బ్రాహ్మణికి స్థలం విక్రయించిన వ్యక్తి కుటుంబానికి చెందిన మరో రెండు ఎకరాలకు కూడా మినహాయింపు ఇచ్చినట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ మినహాయింపులకు, భూముల విక్రయాలకు సంబంధం ఉందా అనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరోవైపు తమ భూములను గ్రామకంఠంగా గుర్తించాలని 698 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, పరిశీలన కమిటీ కేవలం 17 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించినట్లు వార్త‌లు వెల్ల‌డ‌వుతున్నాయి. అర్హత ఉన్నప్పటికీ తమకు మినహాయింపులు ఇవ్వడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

మందడం గ్రామానికి చెందిన రైతు ఆలూరి రంజిత్‌కుమార్ తన ఇంటి సమీపంలోని ఆలయ స్థలానికి మినహాయింపు కోరినా ఫలితం లేకపోయిందని, భూసమీకరణకు సంబంధించిన ఒత్తిళ్లతో ఆయన మరణించారని రైతులు ఆరోపిస్తున్నారు.

గ్రామకంఠం మినహాయింపుల్లో పారదర్శకత, అర్హుల ఎంపికకు అనుసరించిన ప్రమాణాలపై స్పష్టత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రూ.12 వేల కోట్ల అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు స్వతంత్ర నిర్ధారణ లేదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, సీఆర్‌డీఏ అధికారుల వివరణతో పాటు భూ రికార్డుల సమగ్ర పరిశీలన కీలకంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment