ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాప్తాడు (Raptadu) వైసీపీ(YSRCP) సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని (Thopudurthi Prakash Reddy) టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు ప్రవర్తిస్తున్న తీరు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసుల అండదండలతో ప్రతిపక్ష నేతలను అణచివేయడమే లక్ష్యంగా టీడీపీ(TDP) అడుగులు వేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి భద్రతగా ఉన్న గన్‌మెన్‌లను (Gunmens) అకస్మాత్తుగా తొలగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తోపుదుర్తి కుటుంబ సభ్యులు, వైసీపీ(YSRCP) శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తనను భౌతికంగా నిర్మూలించేందుకు ధర్మవరం టీడీపీ(TDP) ఇంచార్జి పరిటాల శ్రీరామ్ (Paritala Sriram), కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబులు (Amilineni Surendra Babu) పథకం పన్నారని, వీరికి మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పూర్తి సహకారం అందిస్తున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
శింగనమల (Singanamala) సమీపంలో తన వాహనాన్ని టిప్పర్ లారీతో ఢీకొట్టించి ప్రమాద వశాత్తూ జరిగిన మరణంగా చిత్రీకరించేందుకు సైతం యత్నించారని ఆయన తల్లిదండ్రులు ఆత్మానందరెడ్డి, ప్రేమ కుమారి, వదిన నయనతా రెడ్డి బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ హత్య కుట్రలపై, ప్రజాస్వామ్య ఉల్లంఘనలపై వైసీపీ ప్రశ్నిస్తుంటే.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ సరికొత్త ఎత్తుగడ వేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్‌కు బినామీగా పేరున్న మడకశిర దళిత ఎమ్మెల్యే ఎంఎస్ రాజును(MS Raju) రంగంలోకి దించి, తోపుదుర్తిపై వ్యక్తిగత దూషణలకు దింపారని ఆరోపిస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకుని పరిటాల శ్రీరామ్, అమిలినేని సురేంద్ర బాబు, కాలువ శ్రీనివాసులు వంటి నేతలు అత్యంత నీచమైన రాజకీయాలకు తెరలేపారని తోపుదుర్తి వర్గం మండిపడుతోంది.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో పోలీసుల తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి వద్ద వందలాది మంది టీడీపీ కార్యకర్తలు గుమిగూడినా, రెచ్చగొట్టేలా వ్యవహరించినా పట్టించుకోని పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వైసీపీ కార్యకర్తలను, అభిమానులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. తోపుదుర్తికి మద్దతుగా వస్తున్న మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్(Usha Sri Charan), హిందూపురం సమన్వయకర్త దీపికలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం వారి పక్షపాత వైఖరికి అద్దం పడుతోందని వైసీపీ శ్రేణులు నిలదీస్తోంది.
బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే, నిందితులకు కొమ్ముకాస్తూ మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఓవరాక్షన్ చేయడంపై తోపుదుర్తి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








