వేప చెట్టు విషయంలో డబుల్ మ‌ర్డ‌ర్‌

వేప చెట్టు విషయంలో డబుల్ మ‌ర్డ‌ర్‌

Summarize with AI

వేప చెట్టు విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. సూర్యాపేట జిల్లాలో మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రగట్టు తండాకు చెందిన భుక్యా సైదా, వెంకటేశ్వర్లు కుటుంబాల మధ్య కొంతకాలంగా ఓ వేప చెట్టు విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో వివాదాస్పదంగా ఉన్న వేప చెట్టు కొమ్మలను వెంకటేశ్వర్లు కొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో సైదా కుమారుడు రాము అడ్డుకుని వెంకటేశ్వర్లుపై గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో వెంకటేశ్వర్లు ఘటనా స్థలంలోనే కుప్పకూలి మృతి చెందాడు.

వెంకటేశ్వర్లుపై దాడి అనంతరం తన కుమారుడు రామును అక్కడి నుంచి తప్పించేందుకు సైదా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాము తన తండ్రి సైదాపై కూడా గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన సైదాను ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు ప్రయత్నించగా.. కొందరు అడ్డుకున్నారు.

రామును తమకు అప్పగిస్తేనే సైదాను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అనుమతిస్తామని స్థానికులు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అనంతరం రాము ఓ ఇంట్లో దాక్కున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు.

రామును పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో స్థానికులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు.. ఈ ఘటనలో ఎస్సై నవీన్‌ తలకు గాయాలయ్యాయి. మరోవైపు తీవ్రంగా గాయపడిన సైదాను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఒకే ఘటనలో వెంకటేశ్వర్లు, సైదా మృతి చెందడంతో ఎర్రగట్టు తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment