సెల్ఫ్ ఫైనాన్స్ సిటీకి రూ. 2,100 కోట్లు ఎందుకు?

సెల్ఫ్ ఫైనాన్స్ సిటీకి రూ. 2,100 కోట్లు ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం గతంలో చేసిన అధికారిక ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలకు పొంతన లేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి పనుల కోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖజానా నుండి మరో రూ. 2,100 కోట్లను విడుదల చేస్తూ ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA)కి ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి అనేది ఒక “సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ” (Self-Financing City) అని, దీని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజల పన్నుల డబ్బు నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గతంలో పలు సందర్భాల్లో బహిరంగ ప్రకటనలు చేశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూములను వాణిజ్య పరంగా వాడుకుంటూ, ఆ నిధులతోనే నగరాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం ప్రచారం చేసింది.

కానీ, ఆ ప్రకటనలకు పూర్తిగా విరుద్ధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి వేల కోట్లు తరలిస్తుండటంపై సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

గతంలోనే అమరావతి పనుల నిమిత్తం రాష్ట్ర ఖజానా నుండి రూ. 2,100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ అంతే మొత్తంలో (రూ. 2,100 కోట్లు) నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే ఆశాజనకంగా లేని తరుణంలో, ప్రభుత్వ ఖజానా నుండి ఈ స్థాయిలో నిధులను మళ్లించడం ఏపీ ఆర్థిక వ్యవస్థకు “గుదిబండ”గా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

అమ‌రావ‌తికి ప్ర‌భుత్వం రాష్ట్ర ఖ‌జానా నుంచి తాజాగా కేటాయించిన నిధులు రూ. 2,100 కోట్లు కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి పేరుతో తెచ్చిన రుణాలు సుమారు రూ. 47,000 కోట్లు అని ప్ర‌తిప‌క్షాలు గుర్తుచేస్తున్నాయి. బ్యాంకుల నుండి తెచ్చిన భారీ రుణాలకు అదనంగా.. ఇప్పుడు నేరుగా ప్రజా ధనాన్ని కూడా రాజధాని ప్రాజెక్టుకు కేటాయించ‌డంపై కూట‌మి ప్ర‌భుత్వ తీరుపై అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి.

రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని, సంక్షేమ పథకాలను పక్కనబెట్టి.. కేవలం ఒకే ఒక్క నగరం కోసం వేల కోట్ల ప్రజా ధనాన్ని కుమ్మరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున విమర్శల పర్వం నడుస్తోంది. అమ‌రావ‌తి త‌న‌ని తాను నిర్మించుకుంటుంద‌ని ప్రచారాలు చేస్తూ.. ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి వేల కోట్ల రూపాయ‌ల‌ను ఎలా కేటాయిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment