ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట సమీపంలో రహదారి పనుల్లో భాగంగా కొండను తొలగించేందుకు అమర్చిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతుల్లో విశాఖపట్నానికి చెందిన ఉపాధ్యాయురాలు సునీత, దేవరాపల్లికి చెందిన కార్మికుడు మణి, చీడికాడకు చెందిన నారాయణరావు, కడప జిల్లాకు చెందిన పవన్ కుమార్తో పాటు మరో వ్యక్తి ఉన్నారు.
పాఠశాలకు వెళ్లే క్రమంలో అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయురాలు సునీత పేలుడు ధాటికి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా కొండను తొలగించేందుకు కాంట్రాక్టర్లు జిలెటిన్ స్టిక్స్ అమర్చినట్లు తెలుస్తోంది. అవి పేలడంతో సమీపంలో ఉన్నవారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, జిలెటిన్ స్టిక్స్ అమరికకు సంబంధించి నిబంధనలు పాటించారా లేదా అనే అంశాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.







