చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద శనివారం అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. గత 3 రోజులుగా విడదల రజినిని పోలీసులు ఆమె స్వగృహంలోనే అక్రమంగా నిర్బంధించారు. ఈ క్రమంలో ఆమెను కలిసేందుకు వచ్చిన దళిత నేత, యడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి పందుల బుల్లబ్బాయిని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా, స్వయంగా మాజీ మంత్రిపైనే భౌతిక దాడికి దిగడం తీవ్ర కలకలం రేపుతోంది.
యడ్లపాడు జెడ్పీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైన దళిత నాయకుడు పందుల బుల్లబ్బాయి.. బీఫామ్ కోసం మాజీ మంత్రి విడదల రజినిని కలవడానికి ఆమె నివాసానికి వచ్చారు. అయితే, మెయిన్ గేటు వద్దే మోహరించిన పోలీసులు ఆయనను లోపలికి వెళ్లకుండా దౌర్జన్యంగా అడ్డుకున్నారు.
తన ఇంటికి వస్తున్న సొంత పార్టీ నాయకులను, అభ్యర్థులను అడ్డుకోవడానికి మీరెవరంటూ విడదల రజిని బయటకు వచ్చి అధికారులను గట్టిగా ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా నామినేషన్ వేయడానికి వస్తున్న దళిత నాయకుడిని లోపలికి అనుమతించాలని పట్టుబట్టారు.
మాజీ మంత్రి ప్రశ్నించడంతో చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక పోలీసు యూనిఫాం మర్చిపోయి అత్యంత పాశవికంగా వ్యవహరించారు. విడదల రజినిని గట్టిగా తోసి కింద పడేశారు. అంతటితో ఆగకుండా, కిందపడిన మాజీ మంత్రిని మళ్లీ మరోసారి బలంగా తోస్తూ, అక్కడే ఉన్న రాతి బండపైకి నెట్టివేసేందుకు యత్నించారు. తోపులాటలో ఆమెకు స్వల్ప గాయాలవ్వగా, వెంటనే వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆమెను సురక్షితంగా లోపలికి తీసుకెళ్లాయి.
ఒక మహిళ నాయకురాలు అని కూడా చూడకుండా, పైగా రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ఒక ప్రజాప్రతినిధిపై ఆమె సొంత ఇంటి గేటు ముందే ఎస్ఐ స్థాయి అధికారి ఈ తరహా దాడికి దిగడం పట్ల వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విడదల రజినిని నెట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే ప్రతిపక్ష నేతలను చంపేసే స్థాయిలో భౌతిక దాడులకు తెగబడటంపై ఆగ్రహం వ్యకం చేస్తున్నారు. ఎస్ఐ ప్రియాంకపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ డిమాండ్ చేస్తోంది.








