ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు, పోలీసుల ప్రేక్షకపాత్ర వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నిండు గర్భిణులు, మహిళల చీరలు లాగుతూ నామినేషన్ పత్రాలను విచక్షణారహితంగా చించివేయడం లాంటి భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా ప్రముఖ జర్నలిస్టులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.

జాతీయ దిగ్గజాలు, హక్కుల పోరాట యోధులు ఏమన్నారంటే..?
“ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది అత్యంత అసాధారణమైన ప్రజాస్వామ్య విధ్వంసం. అధికార టీడీపీ గూండాలు ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్ పత్రాలు దాఖలు చేయకుండా బహిరంగంగా అడ్డుకుంటున్నారు. ఇదంతా పోలీసులు, ఎన్నికల అధికారుల కళ్లెదుటే, వారి పూర్తి కుమ్మక్కుతో సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దారుణంగా అపహాస్యం చేస్తోంది.”
- ప్రశాంత్ భూషణ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త)
“ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం రెండూ ఉనికిలో లేవు. టీడీపీ, బీజేపీల నేతృత్వంలో అక్కడ పూర్తిస్థాయి ‘ఆటవిక రాజ్యం’ రాజ్యమేలుతోంది.”
- ప్రశాంత్ కనోజియా, స్వతంత్ర ప్రముఖ జర్నలిస్ట్
“ఏపీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యంపై బహిరంగంగా దాడి జరుగుతోంది. అధికార పార్టీ గూండాలు మహిళా అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను హింసాత్మకంగా లాక్కుంటున్నారు. మహిళల పట్ల ఈ రకమైన దాష్టీకాలు తీవ్ర సిగ్గుచేటు, ఏమాత్రం ఆమోదయోగ్యం కావు.”
- అఖిల భారత మహిళా కాంగ్రెస్
“ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? అత్యున్నత స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు ఇదంతా చూస్తూ ఊరుకుంటోందా? ఖాకీల సాక్షిగా చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో మహిళ నామినేషన్ పత్రాలను లాక్కుంటుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం దారుణం.”
- తీస్తా సెతల్వాడ్ ప్రముఖ సామాజిక కార్యకర్త
“దక్షిణ భారతదేశంలోని ఒక రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర అవకతవకలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఇటువంటి దౌర్జన్యాలు, బెదిరింపులను ఎదుర్కొంటున్న ప్రజలకు, అభ్యర్థులకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు నిలవాల్సిన అవసరం ఉంది.”
- ఫ్రాన్సెస్కో ఫాచిని, అంతర్జాతీయ విశ్లేషకులు
13 జిల్లాల్లో 31 హింసాత్మక ఘటనలు
జాతీయ వార్తా సంస్థ ‘నేషనల్ హెరాల్డ్’ కథనం ప్రకారం.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నామినేషన్ పత్రాలను లాక్కోవడం, అభ్యర్థులపై భౌతిక దాడులు చేయడం, పత్రాలను చించివేయడం లాంటి 31 రకాల తీవ్రమైన ఎన్నికల నేరాలను పోలీసు యంత్రాంగం అధికారికంగా గుర్తించాల్సి వచ్చింది.
ఇదే అరాచకం ప్రతిపక్షాలు పాలించే ఏవైనా రాష్ట్రాల్లో జరిగి ఉంటే నేషనల్ మీడియా ఛానెళ్లు ప్రైమ్‌టైమ్ లైవ్‌లు పెట్టి అల్లకల్లోలం చేసేవని, కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ మూగనోము వహించడంపై సోషల్ మీడియాలో నమ్ర పటేల్, అనుషా రవి సూద్, సందీప్ మనుధనే వంటి ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో పోటీ చేసే ప్రాథమిక హక్కును, రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థలను టీడీపీ అల్లరి మూకలు, కొందరు పోలీసులు కలిసి బలితీసుకుంటున్న తీరుపై దేశవ్యాప్తంగా లభించిన ఈ వ్యతిరేకత.. చంద్రబాబు సర్కార్ అప్రజాస్వామిక తీరుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు.
అభ్యర్థులపై దాడులు చేసి, నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరించి ఏకగ్రీవాలు చేసుకోవాలని చూస్తున్న కూటమి నాయకులకు, ఈ జాతీయ స్థాయి నిరసనలు, సుప్రీంకోర్టు విచారణలు రాబోయే రోజుల్లో కోలుకోలేని దెబ్బ తీయడం ఖాయంగా కనిపిస్తోంది.








