సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్షయాదవ్ ఆధ్వర్యంలో ఏసీపీ రమేష్, సీఐ రాజు అల్లు అర్జున్‌ను సుమారు మూడు గంటల పాటు విచారించారు. విచారణకు ముందు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వీడియోను చూపించారని సమాచారం.
వీడియో వీక్షణ అనంతరం అల్లు అర్జున్ విచారణ ప్రారంభమైంది. తన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి సమక్షంలోనే విచారణకు హాజరైన బన్నీ పోలీసులు అడిగిన 18 ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు సమాచారం. కాగా, బన్నీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. మళ్లీ నోటీసులు జారీ చేస్తే, విచారణకు రావాల్సి ఉంఉటందని, అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్‌కు పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విచారణ అనంతరం పోలీస్ సెక్యూరిటీ మధ్య బన్నీని తన ఇంటికి తరలించారు.
తొక్కిసలాట కేసు మరో సంచలన మలుపు తీసుకుంది. బన్నీ బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప ప్రీమియర్ షో అనంతరం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అభివాదం చేసే సమయంలో ఆంటోనీ దురుసుగా ప్రవర్తించాడని, అభిమానులను తోసేశాడని ఆయనపై అభియోగాలు ఉన్నాయి.








