కుంకీ ఏనుగుల‌తో కాదు.. ఏఐ వచ్చేస్తోంది

కుంకీ ఏనుగుల‌తో కాదు.. ఏఐ వచ్చేస్తోంది

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అడవి ఏనుగుల (Forest Elephants)  బెడదతో రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఈ సమస్యను ఎదుర్కోవడానికి కూట‌మి ప్రభుత్వం (Coalition Government) కర్ణాటక (Karnataka) నుంచి కుంకీ ఏనుగుల పేరుతో హ‌డావిడి చేసింది. ఇదొక మ‌హ‌త్త‌ర య‌జ్ఞంగా అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేసిన ఆ ప్రయత్నం పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో, ఇప్పుడు ప్రభుత్వం కొత్త దారిని ఎంచుకుంది.

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) ఆధ్వర్యంలో ప్రభుత్వం తాజా సాంకేతికత ఏఐ (Artificial Intelligence) ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్ట‌నుంది. మనుషులు మరియు అడవి ఏనుగుల మధ్య జరుగుతున్న సంఘర్షణలను తగ్గించడానికి ఈ నూతన ఏఐ వ్యవస్థ సహాయపడుతుందని పవన్ కళ్యాణ్ స్వ‌యంగా వెల్లడించారు.

“ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దార్శనికతలో భాగంగా అడవి ఏనుగుల సమస్యకు సాంకేతిక పరిష్కారం తీసుకొచ్చాం. చిత్తూరు సరిహద్దు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ ఏఐ వ్యవస్థ ప్రారంభించాం” అని తెలిపారు.

ఈ కొత్త వ్యవస్థలో ఏఐ + మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా ఏనుగుల కదలికలను రియల్‌టైమ్‌లో గుర్తించే సామర్థ్యం ఉందట‌. ఏనుగులు గ్రామాల వైపు కదలడం ప్రారంభిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు హెచ్చరికల అలర్ట్‌లు పంపబడతాయని చెబుతున్నారు.

సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థకు విద్యుత్ అవసరం ఉండదు. 24 గంటలూ 7 రోజులూ పర్యవేక్షణ చేస్తుంది. 60 మీటర్ల పరిధిలో 120 డిగ్రీల కోణంలో కంటిన్యూస్ మానిటరింగ్‌ ఉంటుంది. గ్రామాల వైపు ఏనుగులు దారి మళ్లకుండా స్వల్పంగా భయపెట్టి తిరిగి అడవిలోకి వెళ్ళేలా వ్యవస్థ పనిచేస్తుందని చెబుతున్నారు. ఏఐ ఆధారిత ఈ సాంకేతికతతో భవిష్యత్తులో ఏనుగుల బెడద గణనీయంగా తగ్గుతుందనే నమ్మకాన్ని గ‌తంలో మాదిరిగానే వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment