అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల బంద్ (Agency Bandh) కొనసాగుతోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Ayyannapatrudu) గిరిజనుల హక్కులకు ఆటంకం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలపై ఈ నిరసన రాజకీయ, గిరిజన, ప్రజా సంఘాలు 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. గిరిజనుల బంద్‌కు వైసీపీ మద్దతు తెలిపింది. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైతే గిరిజనుల ఉనికికి భరోసా కల్పిస్తున్న 1/70 చట్టానికి(1/70 Act) సవరణలు చేయాలని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు.
స్పీకర్ చేసిన వ్యాఖ్యలతో గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంస్థలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. 1/70 చట్టాన్ని సవరించడం అంటే, గిరిజన భూములను టూరిజం ముసుగులో ఆక్రమించే ప్రయత్నంగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. చట్ట సవరణ గిరిజనులను దోపిడీ చేయడం, వారి హక్కుల (Tribal Rights)పై దాడి చేయడం అవుతుందని మండిపడుతున్నారు.
అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 1/70 చట్ట సవరణ చేస్తే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. బంద్ కారణంగా జిల్లాలోని అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిపుత్రుల ఆందోళనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.








