తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగింది. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నిపుణుల సలహాలతో బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అసెంబ్లీ సమావేశాలకు శరవేగంగా ప్రణాళిక
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది. మార్చి 10 తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
మున్సిపాలిటీల విస్తరణ
మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మండలాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మేడ్చల్ పట్టణ జిల్లా గా మారనుంది. అలాగే సెర్ఫ్, మెప్మా సంస్థల విలీనానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ములుగు సహా మరికొన్ని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో, ఆ గ్రామాలను గ్రామపంచాయతీల జాబితా నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు.








