కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో కీలకంగా ఉన్న అధికారులు ఇప్పటికీ కొనసాగుతూ, ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి ప్రభుత్వ రహస్యాలను లీక్ చేస్తున్నారని ఆరోపించారు.
అవినీతి అధికారుల జాబితా సిద్ధం
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక చోట్ల ఇంటలిజెన్స్ విఫలమైందని, అవినీతి అధికారుల జాబితా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరిందని మధుయాష్కీ పేర్కొన్నారు. వీరిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను పక్కన పెట్టాలని ప్రభుత్వ పెద్దలకు సూచించారు. పోలీసుల వైఫల్యమే భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్యకు కారణమని పేర్కొన్నారు. అలాగే, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ హయాంలో జరిగిన జీఎస్టీ కుంభకోణం ఇంకా బహిర్గతం కావాల్సి ఉందని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఆయన ఆదేశించారు. అయితే, అధిక సంఖ్యలో అధికారులు ఈ ఆదేశాలను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది దృష్టిలో ఉంచుకుని, పనితీరు సరిగాలేని అధికారులను తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించేలా సీఎంఓ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.








