ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఏపీని విడిచి మహారాష్ట్రకు తరలిపోయింది. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉర్రూతలూగిన ఈ ప్రముఖ సంస్థ ఇప్పుడు ఏపీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. మహారాష్ట్ర, తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను కోల్పోయింది.
ఏపీలో ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారిన తరువాత జిందాల్ సంస్థపై వేధింపులు మొదలయ్యాయి. ముంబైకి చెందిన ప్రముఖ నటి కాదంబరి జత్వానీని రంగంలోకి దించి పారిశ్రామిక వేత్త జిందాల్ సహా పలువురు ఉన్నతాధికారులపై ఆరోపణలు చేయించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం జిందాల్‌ను లేనిపోని నిందలు వేసి వేధింపులకు గురిచేసింద, చంద్రబాబు సర్కార్ కారణంగానే జిందాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. సినీ నటిని అడ్డుపెట్టుకొని చేసిన చర్యల మూలంగా ఏపీ రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను కోల్పోయినట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఏపీకి గట్టి దెబ్బ..
వైసీపీ హయాంలో రూ.వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, ఇప్పుడు ఏపీని వదిలి మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధమైంది. అంతేకాకుండా రూ.800 కోట్లతో తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం సజ్జన్ జిందాల్‌పై ఒత్తిడి తీసుకురావడంతోనే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఏపీని వదిలేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మహారాష్ట్రలో భారీ ప్రాజెక్టులు
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ మహారాష్ట్రలో ఇనుము, ఉక్కు, సౌర విద్యుత్, ఆటోమొబైల్ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.







