అమరావతి నిర్మాణ వ్యయంపై ప్రశ్నిస్తే రుషికొండపై దుష్ప్రచారమా?

అమరావతి నిర్మాణ వ్యయంపై ప్రశ్నిస్తే రుషికొండపై దుష్ప్రచారమా?

Summarize with AI

అమరావతి రాజధాని నిర్మాణాల్లో వ్యయం, అవినీతిపై వైసీపీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో రుషికొండ భవనాల నిర్మాణ వ్యయం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. రుషికొండ భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.30 వేలు ఖర్చు చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో కూటమి ప్రభుత్వంలోని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ స్వయంగా శాసనసభ, శాసనమండలిలో ఇచ్చిన సమాధానాలను ప్రస్తావిస్తూ తాజా ప్రచారాన్ని ప్రశ్నిస్తోంది.

2024 నవంబర్‌ 14న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అసెంబ్లీలో ఇచ్చిన వివరాల ప్రకారం రుషికొండ భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.15,293. అదే ఏడాది నవంబర్‌ 19న శాసనమండలికి మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం..

ఏడు భవన బ్లాకుల నిర్మాణ వ్యయం – రూ.222.92 కోట్లు.
ఇతర పనులకు వ్యయం – రూ.186.47 కోట్లు.
మొత్తం ప్రాజెక్టు వ్యయం – రూ.409.39 కోట్లు.
అప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం – రూ.320.03 కోట్లు.

మంత్రి ఇచ్చిన లెక్కల ప్రకారమే ఏడు భవన బ్లాకుల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.15,293గా ఉందని వైసీపీ గుర్తుచేస్తోంది. మరి ఇప్పుడు చదరపు అడుగుకు రూ.30 వేల లెక్క ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తోంది. భవనాల నిర్మాణ వ్యయానికి, ఇతర అభివృద్ధి పనుల వ్యయానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విస్మరించకూడదని స్పష్టం చేస్తోంది.

రుషికొండలో మొత్తం 61 ఎకరాల ప్రాజెక్టు స్థలంలో రిసార్ట్‌ అభివృద్ధికి వినియోగించింది 9.88 ఎకరాలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం 19,968 చదరపు మీటర్ల భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వగా, వాస్తవంగా నిర్మించింది 13,542 చదరపు మీటర్లు. అంటే అనుమతించిన భవన విస్తీర్ణం కంటే 6,426 చదరపు మీటర్లు తక్కువగానే నిర్మాణం చేపట్టారు.

పాత హరిత రిసార్ట్‌ స్థానంలోనే కొత్త భవన సముదాయాన్ని నిర్మించారు. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ నిధులతో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ నిర్మాణాలను చేపట్టింది. వాటి వినియోగంపై నిర్ణయం తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానిదే.

విశాఖపట్నంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయం కోసం పలు భవనాలను పరిశీలించిన అధికారుల కమిటీ రుషికొండ భవనాలను సిఫారసు చేసింది. ఆ మేరకు అప్పటి ప్రభుత్వం వాటిని వినియోగించేందుకు ఆదేశించింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా కేటాయిస్తే అది ఆయన వ్యక్తిగత ఆస్తి ఎలా అవుతుందని వైసీపీ ప్రశ్నిస్తోంది.

రుషికొండ భవనాల నిర్మాణ వ్యయంపై తొలుత జరిగిన ప్రచారానికి 2024 నవంబర్‌ 19న శాసనమండలిలో మంత్రి ఇచ్చిన సమాధానమే భిన్నంగా ఉందని వైసీపీ పేర్కొంటోంది. ఆ తర్వాత ‘జగన్‌ ప్యాలెస్‌’ అంటూ ప్రచారం చేసినప్పటికీ, 2025 ఆగస్టు 29న కూటమి ప్రభుత్వమే వాటిని పర్యాటక రిసార్ట్‌గా పేర్కొంటూ జీవో జారీ చేసిన విషయాన్ని గుర్తుచేస్తోంది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను ప్రజోపయోగానికి వినియోగించకుండా రెండున్నరేళ్లుగా నిరుపయోగంగా ఉంచడంపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన కూటమి ప్రభుత్వం వాటిపై రాజకీయ వివాదాలను కొనసాగిస్తోందని మండిపడుతోంది.

అమరావతి నిర్మాణ వ్యయంపై లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, రుషికొండ భవనాలపై రాజకీయ ప్రచారానికి బదులు అధికారిక లెక్కలను ప్రజల ముందుంచాలని వైసీపీ డిమాండ్‌ చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment